ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ ఉదయం వెలగపూడి సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గంలో పలు అంశాలపై చర్చించారు. లేఅవుట్లు, భవనాల నిర్మాణాలకు ఇక నుంచి మునిసిపాలిటీలే అనుమతులు ఇచ్చేలా ఆర్డినెన్స్ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి రాజధానిలో రూ.2733 కోట్ల పనులకు 44వ సీఆర్డీయే సమావేశం తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
రామాయంపట్నంలో రూ.95 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు రాష్ర్ట మంత్రి వర్గం ఆమోదించింది. కాకినాడలో రూ.16 వేల కోట్లతో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమల ఏర్పాటుకు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిఠాపురం పట్టణాభివృద్ధి సంస్థలో 19 ఉద్యోగాల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాయలసీమ జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పలు అంశాలపై చర్చించిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రులు సీఎంతో విడివిడిగా సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్న సందర్భంగా మంత్రుల పనితీరుపై సీఎం సమీక్షించనున్నారు.