కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోటి తాలూకా ఉమ్రాని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను ఓ భార్య అతి కిరాతకంగా చంపి, ముక్కలు ముక్కలు చేసి గ్రామ శివారులో పడేసిన ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఉమ్రాని గ్రామానికి చెందిన శ్రీమంత్ హిట్నల్, సావిత్రి భార్యా భర్తలు. వారికి నలుగురు సంతానం. కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అయినా శ్రీమంత్ హిట్నల్ ఏ పని చేయకుండా తాగి తిరుగుతూ, నిత్యం భార్యను పిల్లలను వేధిస్తున్నాడు. విసిగి వేసారిన సావిత్రి తాగి ఇంటికి వచ్చిన శ్రీమంత్పై దాడి చేసి చంపేసిందని పోలీసులు తెలిపారు. శ్రీమంత్ చనిపోయిన తరవాత నాలుగు ముక్కలు చేసి, బకెట్లో వేసుకుని గ్రామ శివారులో పడేసినట్లు గుర్తించారు.
గ్రామస్తుల సమాచారంతో పోలీసులు కేసు విచారిస్తున్నారు. హత్య చేసిన తరవాత శవాన్ని ముక్కలు చేసి పడేసిన భార్య సావిత్రి, భర్త దుస్తులు కూడా దూరంగా తీసుకెళ్లి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. సావిత్రిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.