మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు వెలువడి వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ప్రమాదం గురించి తెలిసిందే. ఆ విషాదకర దుర్ఘటన జరిగిన 4దశాబ్దాల తర్వాత, ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి 337 టన్నుల విష వ్యర్థాలను తొలగించారు. వాటిని 12 పెద్దపెద్ద ట్రక్కుల ద్వారా దూరంగా తీసుకుపోయారు.
యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఇన్నాళ్ళుగా ఉండిపోయిన 337 టన్నుల విషవ్యర్థాలను నిన్న జనవరి 1 రాత్రి తొలగించారు. 12 కంటెయినర్లలోకి ఆ వ్యర్థాలను నింపి, వాటిని పూర్తిగా సీల్ చేసి, 12 ట్రక్కులతో తరలించారు. భోపాల్ నుంచి ధార్ జిల్లాలోని పీతంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తీసుకెళ్ళారు. ఆ మార్గం అంతా అంటే సుమారు 250 కిలోమీటర్ల దూరం అంతా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసారు. విష వ్యర్థాలను కంటెయినర్లలోకి ఎక్కించడానికి సుమారు 100 మంది పనిచేసారు. విషవ్యర్థాల ప్రభావం పడకుండా ఉండడానికి ఒక్కొక్కరూ అరగంట మాత్రమే పనిచేసారు.
యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విష వ్యర్థాలను తొలగించాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని పూర్తి చేయలేదు. దాంతో 2024 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. నాలుగు వారాల్లోగా పని పూర్తి చేయాలని ఆదేశించింది.
1984 డిసెంబర్ 4 రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి భయంకరమైన విషపూరితమైన మిథైల్ ఐసో సైనేట్ (ఎంఐసి) వాయువు లీక్ అయింది. దాని దుష్ప్రభావంతో 5479 మంది చనిపోయారు. వేలాది మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యారు. కొన్ని తరాల పాటు భోపాల్ పరిసర ప్రాంతాల్లో పిల్లలు శారీరక అవకరాలతో పుట్టారు. ప్రపంచంలోనే అతి భయంకరమైన పారిశ్రామిక ప్రమాదాల్లో అదొకటి.