అంతర్జాతీయ మీడియా సంస్థ అల్‌జజీరాను పాలస్తీనా అధికారులు నిషేధించారు. తమ భూభాగంలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోందంటూ నిషేధం విధించారు. ఇక నుంచి అల్‌జజీరా పాలస్తీనాలో ఎలాంటి కంటెంట్ ప్రసారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. తమ ప్రజలను రెచ్చగొడుతోందని వారు ఆరోపించారు. రుమల్లాలోని తమ కార్యాలయానికి అల్‌జజీరా ప్రసారాలు నిలిపివేయాలని ఆదేశించారు. దేశంలోని అల్‌జజీరా ఉద్యోగులు ఖాళీ చేయాలని పాలస్తీనా అధికారులు ఆదేశించారు.
పాలస్తీనా నిర్ణయంపై హమాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలస్తీనా అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. పాలస్తీనా అధికారులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని హమాస్ ఉగ్రవాద సంస్థ డిమాండ్ చేసింది. ప్రజల హక్కులు కాలరాసేలా ఈ నిర్ణయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను ప్రపంచానికి తెలియజేయడం, ప్రజల హక్కులపై పోరాడే అల్‌జజీరాను నిషేధించడంపై హమాస్ ఆందోళన వ్యక్తం చేసింది.
అల్‌జజీరా రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తోందంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు.గత నెలలోనే అల్‌జజీరా ప్రసారాలపై ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా పాలస్తీనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.