ఏపీలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో 18.53 లక్షల పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసి పరికరాలు కొనుగోలు చేసింది. ఇందుకు వైసీపీ ప్రభుత్వం రూ.6500 కోట్లు ఖర్చు చేసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బంధువులకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి టెండర్లు లేకుండానే స్మార్ట్ మీటర్ల పనులు అప్పగించారు.
యూపీలో రూ.6వేలకు స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేయగా, ఏపీలో ఒక్కో స్మార్ట్ మీటర్‌కు రూ.35 వేలు ఖర్చు చేశారు. 18 లక్షల స్మార్ట్ మీటర్లు విద్యుత్ సంస్థల వద్ద డంప్ చేసి షిర్డిసాయి కంపెనీ బిల్లులు డ్రా చేసుకుంది. ఆ మీటర్లు రైతుల పంపుసెట్లకు పెట్టాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎన్నికల ముందు వ్యతిరేకత వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో విరమించుకున్నారు.
లక్షలాది మీటర్లు వృధాగా పడిఉన్నాయి. పంపుసెట్లకు ప్రభుత్వం ఉచితం విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇక వాటికి మీటర్లు పెట్టి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేసిన స్మార్ట్ మీటర్లను ఏపీలో వాణిజ్య వినియోగదారులకు ఉచితంగా బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.