రేషన్ బియ్యం మాయం కేసులో నిందితురాలు, మాజీమంత్రి పేర్ని నాని భార్య జయసుధ బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గోడౌన్ వ్యవహారాలన్నీ మేనేజరే చూసుకునే వారంటూ, బియ్యాన్ని అతనే పక్కదోవ పట్టించి ఉండవచ్చునంటూ ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసారని సమాచారం.
విచారణ అధికారి ఏసుబాబు సుమారు రెండున్నర గంటల పాటు పేర్ని జయసుధను ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఇతర నిందితులు విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా జయసుధ విచారణ సాగింది. బ్యాంకు లావాదేవీలు, వేబ్రిడ్జి ట్యాంపరింగ్. టెలిఫోన్ కాల్స్ వంటి విషయాల గురించి సుమారు 45 ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది.
పోలీసుల ప్రశ్నలకు జయసుధ చాలావరకూ తనకు తెలీదు, గుర్తులేదు అని జవాబులిచ్చారని సమాచారం. తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలంగా గోడౌన్ వ్యవహారాలన్నీ మేనేజర్ మానస్తేజ చూసుకున్నారని, తనకు తెలియకుండా అతనే అక్రమాలకు పాల్పడి ఉంటాడని జయసుధ చెప్పారని తెలుస్తోంది. మాజీ మంత్రి భార్య తమ విచారణకు సహకరించారని, అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామనీ సర్కిల్ ఇనస్పెక్టర్ ఏసుబాబు చెప్పారు.
బుధవారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు మంగళవారం రాత్రి పేర్ని జయసుధ నివాసానికి వెళ్ళారు. డిసెంబర్ 31 కావడంతో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోడానికి పేర్ని కుటుంబం బైటకు వెళ్ళినట్లు తెలియడంతో నోటీసులను ఇంటి గోడకు అతికించారు. ఇక, బుధవారం నాటి విచారణకు పేర్ని జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో వెళ్ళడం విమర్శలకు దారితీసింది. జయసుధ విచారణకు మచిలీపట్నం మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, లాయర్లు పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. అయితే జయసుధ న్యాయవాదులను విచారణ గదిలోకి అనుమతించలేదు.