డీఎంకే నాయకుడు స్టాలిన్ పరిపాలనలో తమిళనాడులో మహిళలపై నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. చెన్నై అన్నా విశ్వవిద్యాలయంలో యువతిపై సామూహిక అత్యాచారం-హత్య ఘటన ఇంకా పచ్చిగా ఉండగానే మరిన్ని దుర్ఘటనలు వెలుగు చూసాయి.
2024 డిసెంబర్ 25న కన్యాకుమారిలో 12ఏళ్ళ బాలికపై లైంగికదాడి జరిగింది. బాధిత బాలిక తిరుచినాపల్లిలో వాలీబాల్ టోర్నమెంట్లో ఆడి తిరిగి వచ్చింది. పాఠశాల దగ్గర నిలబడి తండ్రికోసం ఎదురు చూస్తూండగా 37ఏళ్ళ ఫైజల్ ఖాన్ అనే వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. బాలిక టాయిలెట్ కోసం వెతుక్కుంటూ ఉండగా దగ్గరలో ఉన్న ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెను గదిలో బంధించి లైంగికంగా దాడి చేసాడు. తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియజేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఫైజల్ఖాన్ను అరెస్ట్ చేసారు. ఆ సంఘటనలో బాలిక మిత్రుడైన 21ఏళ్ళ రేజీస్ కుమార్ అనే యువకుడి ప్రమేయం కూడా ఉందని తెలిసింది. రేజీస్ కుమార్ ఇలా ఎంతమంది బాలికలను ఫైజల్ ఖాన్ ఇంటికి పంపించాడన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆ మర్నాడే కాళ్ళకురిచి జిల్లాలో 28ఏళ్ళ నిర్మల అనే మహిళను దారుణంగా హింసించి చంపేసిన సంఘటన వెలుగు చూసింది. నిర్మల భర్త నాలుగేళ్ళ క్రితం కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. అప్పటినుంచీ ఆమె పాల వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు కూతుళ్ళను ఒంటరిగానే పెంచుకుంటోంది. డిసెంబర్ 26న ఆమె పాలు పోడయానికి వెళ్ళింది. మర్నాడు సమీపంలోని చెరకు పొలాల్లో ఆమె శవం దొరికింది. ఆమెను రేప్ చేసి చంపేసారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఈ దుర్మార్గాలు అంతటితో ఆగలేదు. చెన్నైలోని రాజా అన్నామలైపురంలో 47ఏళ్ళ పాస్టర్ టి కెనిత్ రాజ్ అలాంటి ఆరోపణలపైనే అరెస్ట్ అయ్యాడు. వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న ఒక మహిళకు ప్రత్యేక ప్రార్థనలతో ఆమె సమస్యలు తొలగిస్తానని పాస్టర్ కెనిత్ రాజ్ నమ్మించాడు. ప్రార్థనల పేరిట ఆమెను లైంగికంగా వేధించాడు. విషయాన్ని బైటకు చెబితే ఆమె కుటుంబానికి హాని కలిగిస్తానని బెదిరించాడు. అయినా బాధితురాలు ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో పాస్టర్ అరెస్టయ్యాడు.
అలాంటిదే మరో సంఘటన శివగంగలోని పెంతెకోస్తు చర్చిలో జరిగింది. విడాకులైన 34ఏళ్ళ మహిళను పెళ్ళి చేసుకుంటానని ఆశ చూపించి చర్చి ఉద్యోగి మహేష్ లోబరచుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యాక తనకు ఆమెతో కానీ, ఆమె గర్భంతో కానీ ఏ సంబంధమూ లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.
నామ్ తమిళర్ కచ్చి అనే రాజకీయ పార్టీ ఐటీ విభాగంలో పనిచేసే శక్తివేల్ అనే వ్యక్తి కూడా ఇలాంటి తప్పుడు పనులకే అరెస్ట్ అయ్యాడు. రాజకీయ పార్టీ నేపథ్యాన్ని అడ్డుపెట్టుకుని పలువురు మహిళలను లొంగదీసుకుని వారిని గర్భవతులను చేసాడు. వారిలో ఒక బాధితురాలు శక్తివేల్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టింది.
చెన్నైలోనే ఒక కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న జియావుద్దీన్ ఒక విద్యార్ధినిని లైంగికంగా వేధించాడు. పెళ్ళి చేసుకుంటానని తప్పుడు వాగ్దానాలు చేసి లొంగదీసుకున్నాడు. అంతేకాదు, పెళ్ళి ఆశ చూపించి ఆమె నుంచి డబ్బులు, ఆభరణాలు కూడా తీసుకున్నాడు. బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.
పుదుక్కోటై జిల్లాలో 20 ఏళ్ళ నర్సింగ్ విద్యార్ధిని సౌమ్య కనిపించకుండా పోయింది. ఒకట్రెండు రోజుల్లో ఆమె శవం ఒక బావిలో దొరికింది. ఆమె ప్రియుడుగా భావిస్తున్న మణికందన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇటీవల తమిళనాడులో అమ్మాయిలు అదృశ్యమైపోయిన కేసులు, శవాలుగా దొరుకుతున్న కేసులూ పెద్దసంఖ్యలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
2024 డిసెంబర్ 21న ఆవుదయర్కోయిల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. స్థానిక డిఎంకె నాయకుడు ఆర్ భారతీరాజా బెదిరింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. సదరు డీఎంకే నాయకుడు బాధిత మహిళ నగ్నచిత్రాలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరించాడు. వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని, అలా చేయకూడదంటే రూ.10లక్షలు ఇవ్వాలనీ బ్లాక్మెయిల్ చేసాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా, తనకు రక్షణ కల్పించమని పదేపదే కోరినా ప్రయోజనం లేకపోయింది. వారం రోజుల పాటు పోలీసుల చుట్టూ తిరిగితిరిగి, వారేమీ చేయకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఇవి కేవలం కొన్ని కేసులు మాత్రమే. డిఎంకె పాలనలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల కేసులు, ఇతర నేరాల కేసులు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పరమ దారుణంగా తయారయింది.