ఈ ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఒక హోటల్ గదిలో ఒక మహిళ, ఆమె నలుగురు కుమార్తెల శవాలు దొరికాయి. వారి హత్యలకు సంబంధించి ఆ మహిళ కొడుకు అర్షద్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు.
ఆగ్రాకు చెందిన ఆ కుటుంబం కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోడానికి లఖ్‌నవూ వెళ్ళారు. అక్కడ నాకా ప్రాంతంలోని హోటల్ శరణ్‌జీత్‌లో వారి మృతదేహాలు లభించాయి. మరణించిన వారు అస్మా, ఆమె కుమార్తెలు ఆలియా (9), అక్సా (16), రహీమా (18), అలీషియా (19) అని పోలీసులు గుర్తించారు. అస్మా కొడుకు అర్షద్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. తన తల్లిని, చెల్లెళ్ళను తానే చంపేసానని అర్షద్ (24) అంగీకరించాడు. అయితే, ఇరుగు పొరుగు వారి వేధింపులకు తట్టుకోలేక, తనకేదైనా అయితే తన తల్లిని చెల్లెళ్ళనూ చూసుకునేవారు ఎవరూ ఉండరనే భయంతో వారిని చంపేసానని అర్షద్ చెప్పాడని లఖ్‌నవూ సెంట్రల్ జోన్ డీసీపీ రవీనా త్యాగి వెల్లడించారు.
అర్షద్ తన నేరాన్ని వీడియోగా రికార్డు చేసాడు. తను చంపేసిన కుటుంబ సభ్యుల మృతదేహాలను చూపిస్తూ వారిని చంపడానికి తనను పురిగొల్పిన కారణాలను ఆ వీడియోలో వివరించాడు.
అర్షద్ తన కుటుంబంతో సహా అజ్మేర్ వెళ్ళాడు. అక్కడినుంచి వారిని లఖ్‌నవూకు తీసుకెళ్ళాడు, అక్కడ హోటల్ రూం తీసుకున్నాడు. గత రాత్రి ముందుగా తన తల్లి నోట్లో గుడ్డలు కుక్కి మెడ చుట్టూ స్కార్ఫ్ చుట్టి ఊపిరాడకుండా బిగించి చంపేసాడు. అదే పద్ధతిలో తన చెల్లెళ్ళను కూడా చంపేసాడు. దానికితోడు వారి మణికట్లను కోసేసాడు.
అర్షద్ రికార్డు చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆగ్రాలోని తమ ముస్లిం సమాజానికే చెందిన ఇరుగుపొరుగువారి ప్రవర్తనతోనే భయపడిపోయి అలాంటి తీవ్రమైన చర్యకు పాల్పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసాడు. తన కుటుంబం పరువును కాపాడుకోవాలన్నదే తన కోరిక అని, తనపై ఉన్న తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేకే అయినవారిని చంపుకున్నాననీ అర్షద్ చెప్పుకొచ్చాడు. తన కుటుంబాన్ని రక్షించుకోడానికి సాయం చేయాలంటూ మతపెద్దలను, స్థానిక అధికారులను ఎంతోమందిని అర్ధించాననీ, అయినా ఎలాంటి ప్రయోజనమూ లేకపోయిందనీ బాధపడ్డాడు. దాంతో తమ కుటుంబం వీధుల పాలయిందని వివరించాడు.
‘‘నా చెల్లెళ్ళను నేనే చంపుకోడానికి బాధ్యత మా ముస్లిం సమాజానిదే. నా చెల్లెళ్ళను అమ్మేయకుండా కాపాడుకోవాలని ప్రయత్నించాను. సాయం కోసం ప్రతీ ఒక్కరి దగ్గరకూ వెళ్ళాను. ఏ ఒక్కరూ సాయం చేయలేదు. సుమారు రెండు వారాల నుంచీ నిస్సహాయంగా రోడ్ల మీద చలిలో తిరుగుతూనే ఉన్నము. నా కుటుంబాన్ని ఇలా చలిలో వీధుల్లో నిలబెట్టలేకపోతున్నాను. మా ఇంటి పత్రాలన్నీ మా దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు మా ఇంటిని లాగేసుకున్నారు. ఇంక నాకు గత్యంతరం లేదు’’ అని అర్షద్ వాపోయాడు.
‘‘లఖ్‌నవూ పోలీసులారా, ఈ వీడియో మీకు చేరాక దయచేసి అలాంటి ముస్లిములను వదిలిపెట్టవద్దు. అలాంటి దుర్మార్గులైన ముస్లిముల విషయంలో మీరు పనితీరు గొప్పగా ఉంది. వాళ్ళు అన్నిరకాల నేరాలూ చేస్తున్నారు. దొంగనోట్లను చెలామణీలో పెడుతున్నారు. సామాన్య జనాలను అణగదొక్కుతున్నారు. నిస్సహాయుల నుంచి భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. వాళ్ళతో పోరాడడానికి ప్రయత్నించాను, కానీ ఏమీ చేయలేకపోయాను. మా ఇలాకాలో మా ఇరుగుపొరుగున నివసిస్తున్న ముస్లిములే మా చావులకు కారణం’’ అని అర్షద్ తన వీడియోలో చెప్పాడు.
అర్షద్ తన తల్లిని, చెల్లెళ్ళనూ హత్య చేయడంలో అతనికి సహకరించింది అతని తండ్రే అని తెలుస్తోంది. ఐదు హత్యల తర్వాత అర్షద్ తన తండ్రి అయిన బాదర్‌ను లఖ్‌నవూ రైల్వేస్టేషన్ దగ్గర విడిచిపెట్టాడు. తర్వాత తన నేరం గురించి పోలీసులకు వెల్లడించాడు. అర్షద్ ప్రకటన ఆధారంగా పోలీసు అధికారులు హత్యకు ఉపయోగించిన స్కార్ఫ్, బ్లేడులను స్వాధీనం చేసుకున్నారు. అర్షద్ తండ్రి బాదర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.