హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్లటూన్ కమాండర్ అబ్దల్ హదీ సబాను తుదముట్టించినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. కొద్దిరోజుల క్రితం గాజా దక్షిణ భాగంలోని ఖాన్ యూనిస్ ప్రాంతం మీద జరిపిన డ్రోన్ దాడిలో హమాస్‌కు చెందిన నుక్బా ప్లటూన్ కమాండర్ హతుడయ్యాడు. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది.
‘‘అబ్దల్ హదీ సబా ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఒక శిబిరంలో దాగిఉండి అక్కడినుంచి యుద్ధం చేస్తున్నాడు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడి ఊచకోతకు పాల్పడిన ఉగ్రవాదుల నాయకుల్లో అబ్దల్ హదీ సబా ఒకడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైనిక బలగాలపై పలు ఉగ్రవాద దాడులకు నాయకత్వం వహించాడు. అక్టోబర్ 7 నాటి ఊకోతలో పాల్గొన్న ఉగ్రవాదులు అందరి మీదా ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుంది’’ అని ఐడీఎఫ్ తమ ప్రకటనలో వెల్లడించింది.
అంతకుముందు, 14మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చామని, వారిలో ఆరుగురు అక్టోబర్ 7నాటి దాడిలో పాల్గొన్నవారు అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది.
2024 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద భారీ ఉగ్రవాద దాడికి పాల్పడ్డారు. 1200మంది ఇజ్రాయెలీలను చంపివేసి 250మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను బంధించి తీసుకుపోయారు. వారిలో పలువురు బందీలు చనిపోగా సుమారు వంద మంది ఇంకా హమాస్ చేతిలోనే బందీలుగా ఉన్నారు.