ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ, మాణిక్పూర్ వద్ద గంగా నది ప్రక్షాళన కోసం రూ.272 కోట్లతో చేపట్టబోయే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా – నమామి గంగే పథకం కింద ఈ ప్రాజెక్టును చేపడతారు.
మంగళవారం జరిగిన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసిజి) 59వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారు. గంగానది పునరుజ్జీవనం, పరిశుభ్రతకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఎన్ఎంజిసి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ మిట్టల్ ఆమోదముద్ర వేసారు.
గంగానదిని ప్రక్షాళన చేయడం, పరిశుభ్రంగా నిర్వహించడం, తగినంత అభివృద్ధి చేయడం, నది యొక్క పర్యావరణ-సాంస్కృతిక మహత్తును పరిరక్షించడం ఈ ప్రాజెక్టు ప్రాధమ్యాలు.
బిహార్‌లోని బక్సర్‌లో నదుల పరిరక్షణ విషయంలోనూ కేంద్రప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. రూ.257 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కూడా ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంగీకారం తెలిపింది. ఆ పథకం ప్రకారం రోజుకు 5కోట్ల లీటర్లను పరిశుభ్రం చేసే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తారు.