కర్ణాటక బీజేపీకి చెందిన యువ సంచలనం, ఎంపీ తేజస్వి సూర్య ఒకింటివాడు కాబోతున్నారు. చెన్నైకి చెందిన కళాకారిణి శివశ్రీ స్కందప్రసాద్ను పెళ్ళాడబోతున్నారు. మార్చి 24న వారి వివాహం జరగబోతోంది.
34ఏళ్ళ తేజస్వి సూర్య దేశంలోనే అతి పిన్నవయసు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన వాగ్ధాటి, విషయ అవగాహన, జాతీయవాద దృక్పథం తేజస్వి సూర్యకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. వృత్తిరీత్యా లాయర్ అయిన తేజస్వి సూర్య, బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 సెప్టెంబర్ నుంచి భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేస్తున్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే తేజస్వి సూర్య ఇటీవలే గోవాలో జరిగిన ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్‌ను పూర్తి చేసిన మొట్టమొదటి ఎంపీగా రికార్డు సృష్టించారు.
శివశ్రీ స్కందప్రసాద్ చెన్నైకి చెందిన కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని. ఆమె శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజనీరింగ్‌లో బిటెక్ చేసారు. చెన్నై విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఎ డిగ్రీ కూడా పూర్తి చేసారు. శాస్త్రీయ సంగీతం, నాట్యాల్లో ఆమెది అందెవేసిన చేయి. శివశ్రీ యూట్యూబ్ ఛానెల్‌కు 2లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2024 జనవరిలో ఆమె రాముడిపై పాడిన కన్నడ భక్తి గీతాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల్లో ముంచెత్తారు.