పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2026 డిసెంబర్ నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు, ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా జనవరి రెండో వారంలో కొత్త డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించడానికి కసరత్తులు మొదలుపెట్టింది.
ప్రభుత్వం మొదట వేసుకున్న ప్రణాళిక ప్రకారం జనవరి 2 నుంచే ఈ పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఉపయోగించవలసిన కాంక్రీట్ మిక్స్ డిజైన్‌ను ఖరారు చేయడం జాప్యమవుతోంది. దానికి సంబంధించిన కొన్ని పరీక్షల ఫలితాలు ఇంకా రావాలి. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాత కేంద్ర జలసంఘం, అంతర్జాతీయ నిపుణుల బృందం కాంక్రీట్ మిక్స్ డిజైన్‌ను ఖరారు చేస్తాయి. ఆ వెంటనే నిర్మాణ పనులు మొదలవుతాయి.
డయాఫ్రం వాల్‌కు అవసరమైన కాంక్రీట్ మిక్స్‌కు సంబంధించి నాలుగు డిజైన్లను పరిశీలిస్తున్నారు. వాటిని తిరుపతి ఐఐటీ పరీక్షిస్తోంది. రెండు మిక్స్‌ల పరీక్షా ఫలితాలు ఇప్పటికే వచ్చాయి. వాటిని కేంద్ర జలసంఘానికి, అంతర్జాతీయ నిపుణుల బృందానికీ పంపించేసారు కూడా. మరో రెండు పరీక్షల ఫలితాలు జనవరి 5కల్లా వస్తాయని అంచనా. ఆ తర్వాతా వాటిని కూడా పరిశీలనకు పంపిస్తారు. అంతర్జాతీయ నిపుణుల బృందం సిఫారసు, ఆ తర్వాత కేంద్ర జలసంఘం ఆమోదం వచ్చాక ఒక సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర జలసంఘం, నిపుణుల బృందం, పోలవరం అధికారులు, పోలవరం అథారిటీ సంయుక్త సమావేశాన్ని వర్చువల్‌గా జరుపుతారు.
కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఖరారైన వెంటనే డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన ప్రాథమిక సన్నాహాలు పోలవరంలో జరుగుతున్నాయి. వర్కింగ్ ప్లాట్‌ఫాం, గైడ్‌వాల్ పనులు జరుగుతున్నాయి. నిర్మాణానికి అవసరమైన వివిధ యంత్రాలను ప్రాజెక్ట్ సైట్‌కు చేర్చారు. స్థానికంగా పరీక్షలు చేయడానికి కావలసిన ప్రయోగశాలల ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే వర్షాకాలం లోపు డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.