డిసెంబర్ 31 అర్ధరాత్రి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే పేరిట భారీగా వేడుకలు జరుపుకోవడం అందరికీ అలవాటు అయిపోయింది. క్రిస్మస్ ఈవ్ నాటినుంచే మార్కెట్లన్నీ కళకళలాడడం మొదలవుతుంది. డిస్కౌంట్ పథకాల పేరుతో వినియోగదారులను ఆకర్షించే పథకాలు సందడి చేస్తాయి. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ ప్రతీచోటా బాణాసంచా భారీగా కాల్చి జరుపుకునే వేడుకలను టీవీ ఛానెళ్ళు ఘనంగా ప్రసారం చేస్తాయి. అర్ధరాత్రి వేళ మందు కొట్టడం, కేకులు కోయడం, జంక్‌ఫుడ్ తినడమే సంస్కృతి అన్న అపప్రథ దేశమంతటా ప్రబలిపోయింది. హోటళ్ళ వాళ్ళు, ఇతర వ్యాపారాల వారూ ఈ వాణిజ్య అవకాశాన్ని అందిపుచ్చుకుని జనాల్ని దోచుకుంటారు. ఈ వ్యాపార చిట్కాని కొత్త సంవత్సరంగా మనం ఎందుకు వేడుక చేసుకుంటాం? దీని వెనుక ఉన్న సాంస్కృతిక లేక పర్యావరణ ప్రాధాన్యం ఏంటి? మానవ సమాజం శతాబ్దాలుగా వైజ్ఞానిక దృక్పథంతో ఈ సంబరాలు జరుపుకుంటోందా? న్యూ ఇయర్ వేడుకల బీభత్సాన్ని చూస్తే తలెత్తే కొన్ని ప్రశ్నలివి.
జనవరి 1న కొత్త సంవత్సరం జరుపుకునే పద్ధతి ఈమధ్య కాలంలోనే మొదలైంది అనే విషయం తెలుసుకుంటే యువతరానికి ఆశ్చర్యం కలగవచ్చు. 18వ శతాబ్దం మధ్య వరకూ కూడా ఈ జనవరి 1 సంవత్సరం మొదలు అనేది లేనేలేదు. ఆఖరికి గ్రేట్ బ్రిటన్, అమెరికా దేశాలు కూడా మార్చి 25ను కొత్త సంవత్సరంగా జరుపుకునేవి. రోమన్ రాజు నూమా పాంపిలస్ రోమన్ క్యాలెండర్‌ను సవరించాడు. అన్ని ప్రారంభాలకూ రోమన్ దేవుడైన జానస్ పేరు మీద ఉన్న జనవరి నెలతో సంవత్సరం మొదలయ్యేలా క్యాలెండర్‌ను సవరించాడు. అంతవరకూ మార్చి నెలే మొదటి నెలగా ఉండేది. పూర్వ సామాన్య శకం 43వ సంవత్సరంలో జనవరిని మొదటి నెలగా మార్చాడు ఆ రోమన్ రాజు. అంతవరకూ మార్చి నెలతోనే సంవత్సరం మొదలవుతుండేది. మిగతా నెలలను గమనిస్తే అవి కూడా ఆ వరుసను అనుసరిస్తూండడం అర్ధమవుతుంది. సెప్టెంబర్ అంటే ఏడవ నెల అని అర్ధం. డిసెంబర్ అంటే పదవ నెల అని అర్ధం. క్యాలెండర్లో జనవరిని మొదటి నెలగా చేసిన తర్వాత కూడా లీపు సంవత్సరాలకు సంబంధించిన తప్పుడు లెక్కలే కొనసాగాయి. సామాన్య శకం 1852లో పోప్ గ్రెగరీ 13 సవరించిన క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. అప్పటినుంచీ జనవరి 1 కొత్త సంవత్సరపు మొదలుగా ప్రచారంలోకి వచ్చింది. ఇక లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒకరోజు అదనంగా రావడం కూడా అప్పుడే మొదలైంది. ఆ కొత్త కాలమాన పద్ధతిని గ్రేట్ బ్రిటన్ వంటి ప్రొటెస్టెంట్ దేశాలు ఆ పద్ధతిని 1752 నుంచీ అమలు చేయడం మొదలుపెట్టాయి.
కాబట్టి, అసలు గ్రెగోరియన్ క్యాలెండర్ మొత్తం చర్చి చేసిన ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి ఫలితమే. ఏసుక్రీస్తు పుట్టిన తేదీ అంటూ చర్చి ప్రచారం చేసిన డిసెంబర్ 25తో కొత్త సంవత్సరం పేరుతో డిసెంబర్ 31/జనవరి 1ని కూడా కలిపి ఆ వారమంతా వేడుకలు జరిపే పద్ధతి ప్రవేశపెట్టారు.
రోమన్ల కాలంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కొంచెం మతపరమైన గుర్తింపు ఉన్న కుటుంబ వ్యవహారంగా మాత్రమే ఉండేవి. తర్వాత యూరోపియన్ కాలనైజేషన్ వచ్చాక ఆ పద్ధతిని పూర్తిగా మార్చేసాయి. వ్యక్తిగత వస్తువాదం, పెట్టుబడిదారీ విధానపు లాభార్జనా దృక్పథాల మతిమాలిన సమ్మేళనం అసలు పండుగ తాలూకు అసలైన సారాన్ని చంపేసాయి. ఇంక దీనికి క్రిస్మస్ అమెరికనీకరణ కూడా జతపడింది. శాంటాక్లాజ్ అనే ఊహాజనిత పాత్రను కోకో కోలా డ్రింక్ తమ ప్రచారం కోసం వాడుకున్న తీరు తెలిసిందే. సెయింట్ నికొలాస్ చారిత్రక వ్యక్తిత్వానికీ, శాంటా అందరికీ ప్రేమగా బహుమతులు ఇస్తాడనే ప్రచారానికీ ఏమాత్రం సంబంధం లేదు. బాక్సింగ్ డే, కానుకలు, షాపింగ్ ఇవన్నీ వివిధ సంస్థల, బ్రాండ్ల మార్కెటింగ్ గిమ్మిక్కులు మాత్రమే. ప్రపంచీకరణ, మార్కెట్ ఎకానమీ వ్యవస్థల పుణ్యమా అని ఇప్పుడు ఆ గిమ్మిక్కులు ప్రపంచవ్యాప్తం అయిపోయాయి. అందుకే చర్చి సృష్టించిన, పెట్టుబడిదారీ విధానం స్పాన్సర్ చేస్తున్న ఈ పండుగలు కలుగజేస్తున్న పర్యావరణ క్షీణత వల్ల కలుగుతున్న నష్టాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ విధానం వెనుక ఉన్న మౌలిక స్ఫూర్తి ప్రొటెస్టెంట్ విలువే. అందుకే ప్రకృతి ఆరాధన (పాగన్) విధానపు పండుగలను పర్యావరణ పరిరక్షణ పేరుతో లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నారు.
భారతదేశంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. అవన్నీ వాటివాటి స్థానికత ఆధారంగా, వ్యవసాయ ఋతువులను బట్టి జరుపుకుంటారు. భారతీయ పర్వదినాలు అన్నింటికీ ధార్మికమైన సందర్భాలూ, స్థానిక కథలూ ఉన్నప్పటికీ మౌలికంగా అవన్నీ పంచాంగం అనే శాస్త్రీయ విధానానికి లోబడి ఉంటాయి. కాలాన్ని కొలిచే ఆ పంచాంగ విధానం వేల యేళ్ళుగా అనూచానంగా అమల్లో ఉంది. అంత వైవిధ్యభరితమైన, విస్తృతమైన సంస్కృతిలో మరికొన్ని పండుగలు జరుపుకున్నంత మాత్రాన భారతీయ సంస్కృతిని తగ్గించినట్లు కాదు. మన మౌలిక విలువలు విశ్వజనీనమైనవి. అయితే ఇక్కడ క్రిస్మస్, న్యూ ఇయర్ పేరుతో మన మీద చర్చి రుద్దుతున్న ఆంగ్లో-శాక్సన్ విలువల వెనుక దాగిన ఉద్దేశం మత మార్పిడులు. తమ మతం తప్ప మరే ఇతర ధర్మమూ ప్రపంచంలో ఉండకూడదన్న సంకుచితమైన భావనలు. సరిగ్గా ఆ కారణాల వల్లే ఇజ్రాయెల్, కొంతవరకూ చైనా వంటి దేశాలు ఈ యూరోపియన్-అమెరికన్ పండుగలను ఒక పద్ధతి ప్రకారం దూరం పెట్టాయి, తమవైన జాతీయ పర్వదినాల ద్వారా తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయి. పర్యావరణాన్ని తీవ్రంగా విధ్వంసం చేసే ఇటువంటి పద్ధతులను గుడ్డిగా అనుసరించడం, అవలంబించడానికి బదులు మనం మన మూలాల గురించి మన తాత్వికత గురించి తెలుసుకోవాలి. ఈ వేడుకల చారిత్రక నేపథ్యాన్ని, మన సంస్కృతి మీదా, పర్యావరణం మీదా అవి చూపే ప్రభావాన్ని అర్ధం చేసుకోవాలి.