భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) ఎపిగ్రఫీ విభాగానికి బెంగళూరు గ్రామీణ జిల్లా కమ్మసంద్ర గ్రామంలో సోమేశ్వర ఆలయం దగ్గర వ్యవసాయ క్షేత్రంలో ఒక శిలాశాసనం లభించింది. తమిళంలో ఉన్న ఆ శాసనం చోళుల కాలం నాటిదని అంచనా వేసారు. అది ముక్కలుముక్కలుగా ఉండడంతో దాని నకలు తయారుచేస్తున్నారు. దాని ద్వారా ఆ శాసనంలోని వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
సోమేశ్వర ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అక్కడ పాక్షికంగా పాతివున్న ఒక శిల దొరికింది. దానిమీద శాసనం ఏదో చెక్కి ఉంది. ఆ శిలాశాసనం దొరికిన రైతు ఎఎస్ఐ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో తమ అధికారులు అక్కడకు వెళ్ళి శాసనాన్ని పరిశీలించినట్లు ఎఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి చెప్పారు.
‘‘శిలాశాసనం ఒకవైపు వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. శాసనం రెండోవైపు భూమిలోకి పాతిపెట్టబడి ఉంది. ప్రాథమిక పరీక్షల అనంతరం ఆ శాసనం మీద ఉన్నది తమిళ భాష అని అర్ధమవుతోంది. అది సామాన్యశకం 11వ శతాబ్దానికి, అంటే చోళుల కాలానికి చెందినది. సోమేశ్వర ఆలయంలో పూజా పునస్కారాల కోసం 12కండగాల భూమిని దానం చేస్తున్నట్లు ఆ శాసనం మీద నమోదు చేసారని అర్ధమవుతోంది’’ అని మునిరత్నం రెడ్డి వివరించారు.
పురావస్తు శాఖ రికార్డుల ప్రకారం 1946 నాటికే ఆ గ్రామం, దాని పరిసర ప్రాంతాల్లో నుంచి పలు తమిళ శాసనాలు లభించాయి. చోళరాజుల్లో గొప్పవాడైన రాజరాజ చోళుడి కాలానికి చెందిన శాసనాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ శాసనం రెండో వైపు ఉన్న వివరాలను కూడా కాపీ చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని మునిరత్నం రెడ్డి చెప్పుకొచ్చారు.