విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రజాసమస్యల వినతులు స్వీకరించే వారధి కార్యక్రమంలో ఆదోని ఎంఎల్ఏ డాక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. ఆ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ‘తెలుగుతల్లికి జలహారతి’ పేరుతో నదుల అనుసంధానం ఆలోచనను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోందన్నారు. ‘‘నదుల అనుసంధానం అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ నాటి ఆలోచన విధానం. ఆయన శతజయంతి సంవత్సరంలో నదుల అనుసంధానం నిజంగా గేమ్ ఛేంజరే. 80 లక్షల జనాభాకు తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, 22.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ, పరిశ్రమలకు 20 టిఎంసిల జలాలు అందించడం లక్ష్యంగా జలహారతి కార్యక్రమం రూపొందుతోంది. గోదావరి నీటిని కృష్ణానదికి తరలించడం ద్వారా నదుల అనుసంధానం వేగవంతం చేయడం ఎన్డిఎ ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని బిజెపి భావిస్తోంది. వాజ్పేయీ కల మన రాష్ట్రంలో నెరవేరబోతోంది. వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్ధ అస్తవ్యస్తమైతే ఇప్పుడు ఇరిగేషన్ వ్యవస్ధను చంద్రబాబు గాడిలో పెడుతున్నారు’’ అని ఎమ్మెల్యే చెప్పారు.
జనవరి 5నాటి హైందవ శంఖారావం రాజకీయపార్టీలకు అతీతమన్నారు పార్థసారధి. ఆలయాల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగానే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం జరగనుందన్నారు. ‘‘హైందవ శంఖారావం కార్యక్రమంలో సుమారు రెండులక్షలమంది పాల్గొంటారని అంచనా. దానికి అన్ని పార్టీలూ సహకరిస్తున్నాయి. ధర్మాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి జరగాలి. ఇప్పటికే చాలా దేవాలయాలు ఆస్తులు అన్యాక్రాంతమైపోయాయి, లేదా ఆక్రమణలో ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని గుడుల అభివృద్ధికి నడుం బిగించాల్సిన అవసరం ఉంది. దేవాలయాల మాన్యాలను రక్షించాలి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావానికి వచ్చే వారికి ఏర్పాట్లు జరగబోతున్నాయి’’ అని ఎమ్మెల్యే చెప్పారు.
‘‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హుండీ ఆదాయాలను పక్కదోవ పట్టించారు. చీకటి జీఓలతో దుర్వినియోగం చేసారు. దేవదాయ శాఖకు దేవుడి మీద కంటె హుండీ మీద మాత్రమే భక్తి ఉంది. హుండీ డబ్బులు దేవుడికి కాకుండా సంక్షేమ పథకాలకు ఖర్చుపెడుతున్నారు. నేటికీ చాలా దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు అందక విలవిలలాడుతున్నాయి. ఆలయాల్లో హుండీ ఆదాయాన్ని దేవాలయాలకే ఖర్చు చేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రతిపాదిస్తోంది. హైందవ శంఖారావం రాజకీయ కార్యక్రమం కాదు. అన్ని రాజకీయ పార్టీలూ, ఎందరో సాధు సంతులూ వస్తారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేది మా లక్ష్యం. ప్రభుత్వాలు నియమించే పాలక మండళ్ళకు, దేవదాయ శాఖ అధికారులకూ దేవాలయాలపై భక్తి శ్రద్ధలు ఉండకపోవచ్చు. అందుకే వాటి నిర్వహణలో స్వయంప్రతిపత్తి ఉండాలి’’ అని ఎమ్మెల్యే పార్థసారధి వివరించారు.
పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర నాయకుడు ఉప్పలపాటి శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.