ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (సీఐసీ) ఓ వివాదాస్పద ప్రతిపాదన గురించి యోచిస్తోంది. ఆ కేంద్రం జామియా మిలియా ఇస్లామియాతో ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఎమ్మెస్సీ మ్యాథ్స్ ప్రోగ్రామ్‌లోకి అడ్మిషన్లలో ముస్లిములకు రిజర్వేషన్లు తొలగించాలని భావిస్తోంది. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే, 2013లో ఆ కోర్స్ మొదలు పెట్టిన నాటినుంచీ ఉన్న సీట్ల కేటాయింపు పద్ధతిని సమూలంగా మార్చేస్తుంది.
మెటా యూనివర్సిటీ కాన్సెప్ట్ కింద ప్రారంభించిన ఎమ్మెస్సీ ప్రోగ్రామ్ ఢిల్లీ యూనివర్సిటీకి, జామియా మిలియా ఇస్లామియాకు మధ్య సహకారానికి చిహ్నం. ఆ ప్రోగ్రాంలోకి అడ్మిషన్ల కోసం ఒక ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రస్తుతం ఉన్న సీట్ల పంపిణీ నమూనాలో కొన్ని సీట్లు ముస్లిం విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేసి ఉంచుతారు.
మొత్తం 30 సీట్లు ఉంటే 12 అన్‌రిజర్వుడ్ కేటగిరీ, 6 ఓబీసీలకు, 4 ముస్లిం జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు, 3 ఆర్థికంగా బలహీనులైన వర్గాల వారికి (ఈడబ్ల్యూఎస్), 2 ఎస్సీలకు, 1 ఎస్టీలకు, 1 ముస్లిం ఓబీసీలకు, 1 ముస్లిం మహిళలకు కేటాయిస్తారు.
ఇందులో ముస్లింలకు రిజర్వేషన్ తొలగించాలన్న ప్రతిపాదన గురించి సీఐసీ గవర్నింగ్ బాడీ సోమవారం జరిగిన సమావేశంలో చర్చించింది. విశ్వవిద్యాలయాల కోర్సుల్లో సీట్ల రిజర్వేషన్ మతం ప్రాతిపదికన చేయకూడదు అన్న నియమాన్ని అనుసరించి ఆ ప్రతిపాదన వచ్చింది. ‘‘కుల రిజర్వేషన్లలో భాగంగా వెనుకబడిన తరగతుల వారికిచ్చే రిజర్వేషన్ వేరు. ఇది ఆ పరిధిలోకి రాదు’’ అని సీఐసీకి చెందిన ఒక అధికారి చెప్పారు.
ఎమ్మెస్సీ మ్యాథ్స్ ప్రోగ్రామ్‌ను ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా సంయుక్తంగా నిర్వహిస్తున్నా, ఈమధ్యకాలంలో అడ్మిషన్ల ప్రక్రియ మొత్తాన్నీ ఢిల్లీ యూనివర్సిటీయే చూసుకుంటోంది. కాబ్టి ఆ మొత్తం కోర్సుకు ఢిల్లీ విశ్వవిద్యాలయపు రిజర్వేషన్ విధానాలనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
‘‘ఈ ప్రతిపాదన మీద చర్చలు జరుగుతున్నాయి. గవర్నింగ్ బాడీ ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ ప్రతిపాదనను అనుమతి కోసం వైస్‌ఛాన్సలర్ వద్దకు పంపిస్తాం’’ అని సీఐసీ అధికారి వెల్లడించారు.
మెటా యూనివర్సిటీ కాన్సెప్ట్ అంటే వేర్వేరు సంస్థలకు చెందిన వనరులను, నైపుణ్యాలనూ ఉమ్మడిగా వాడుకోవడం. అలా రెండు యూనివర్సిటీల బలాలను అందరికీ ఉపయోగపడేలా వాడుకోవడం. ఈ కోర్స్ భారతదేశంలో ప్రత్యేకమైనది. ఈ కోర్స్ పూర్తిచేసేవారికి ఇచ్చే డిగ్రీ పట్టా మీద రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాల లోగోలూ ఉంటాయి.
ఈ ప్రోగ్రామ్ ప్రారంభించిన కొత్తలో, 50శాతం విద్యార్ధులు డీయూ నుంచి, మిగతా 50శాతం జామియా మిలియా ఇస్లామియా నుంచీ ఉండాలనీ భావించారు. అయితే రిజర్వుడు సీట్ల పంపిణీ విషయంలో నిర్ణయాన్ని తరవాత తీసుకుంటారు.