అమెరికా ట్రెజరీపై చైనా హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. డిసెంబరు 8న ఈ దాడి జరిగిందని అమెరికా సైబర్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ట్రెజరీలోని కీలక పత్రాలను తెరిచారని తెలిపింది. దీనిపై అమెరికా ఎఫ్‌బిఐతో విచారణ చేయిస్తోంది. కీలక పత్రాలను దొంగలించేందుకు చైనా హ్యాకర్లు దాడికి దిగినట్లు బియాండ్ ట్రస్ట్ వెల్లడించింది. ఈ సంస్థ సైబర్ సెక్యూరిటీ వ్యవహారాలు చూస్తోంది.
కీలక దస్త్రాలు, వర్క్ స్టేషన్లపై చైనా హ్యాకర్లు దాడి జరిపిన విషయాన్ని అమెరికా ద్రవీకరించింది. దీనిపై రెండు పార్టీలతో విచారణ చేయించగా హ్యాకింగ్ ప్రయత్నాలను కనుగొన్నారు. అయితే చైనా మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. తమ హ్యాకర్లు అలాంటి ప్రయత్నం చేయలేదని చైనా ఖండించింది.
అమెరికా ట్రెజరీపై దాడి చేసి కీలక పత్రాలు కాజేసేందుకు చైనా చేసిన ప్రయత్నం విఫలమైందా? సఫలమైందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా కేవలం సైబర్ దాడి జరిగినట్లు మాత్రమే చెబుతోంది. అయితే కీలక సమాచారం చైనా చేతికి చేరినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. డిసెంబరు 8న సైబర్ దాడి జరగ్గా, ఆలస్యంగా ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థలు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది.