ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి ప్రాంతంలో గతంలో క్రైస్తవంలోకి మారిన 651 కుటుంబాలు ఇప్పుడు మళ్ళీ హిందూధర్మంలోకి పునరాగమనం చేసాయి. ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ కృషితో ఆ కుటుంబాలు ఘర్‌వాపసీ అయ్యాయి. ప్రబల్ జుదేవ్ కుటుంబం రెండు తరాల నుంచీ ఇదే పనిలో ఉంది. ఇప్పటివరకూ వేలాది కుటుంబాలను సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చేలా కృషి చేసింది.
సక్తిలో నిర్వహించిన భారీ హిందూ సమావేశంలో ఈ ఘర్ వాపసీ నిర్వహించారు. బీజేపీ నాయకుడైన ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్, స్వధర్మంలోకి తిరిగి వస్తున్న ఆ కుటుంబాల సభ్యుల కాళ్ళు కడిగి సనాతనంలోకి స్వాగతించారు. ఆ కార్యక్రమంలో సాధ్వి ప్రజ్ఞ సహా ఎంతోమంది సాధుసంతులు పాల్గొన్నారు.
ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘‘నకిలీ హిందువుల నుంచి సనాతన ధర్మం అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ఆ క్రిప్టో క్రిస్టియన్స్ (మనసులో క్రైస్తవులు, వేషానికి హిందువులు) మన హిందూ సమాజంలోనే మనతోనే కలిసి ఉంటారు. మోసపూరితమైన మతమార్పిడులను ప్రోత్సహిస్తుంటారు. ఉగ్రవాదుల్లో స్లీపర్‌సెల్స్ మాదిరిగా పనిచేస్తారు. వాళ్ళ ముసుగులను తొలగించి, వారి నిజస్వరూపాలను వెల్లడి చేయడం అత్యంత అవసరం. అలాంటి వారిమీద కఠినమైన చర్యలు తీసుకోవాలి’’ అని ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ చెప్పుకొచ్చారు.