గల్ఫ్ దేశం యెమెన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళకు చెందిన నర్సు నిమిషప్రియకు (36) ఆ దేశంలో మరణశిక్ష పడింది. ఒక యెమెన్ దేశస్తుడిని హత్య చేసిన కేసులో నిమిష కొన్నేళ్ళుగా అక్కడి జైల్లో ఉంది. ఆమెకు మరణ శిక్ష విధించడానికి యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమీ నిన్న ఆమోదం తెలిపారు.
నిమిష శిక్షను తగ్గించడానికి ఆమె కుటుంబం చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. అధ్యక్షుడి ఆమోద ముద్ర పడడంతో ఆమెకు నెల రోజులలోపే మరణశిక్ష అమలు చేసే అవకాశాలున్నాయి. నిమిష తల్లి ప్రేమకుమారి తన కుమార్తెను మరణశిక్ష నుంచి కాపాడడానికి అన్ని ప్రయత్నాలూ చేసారు. దానికోసమే ఆమె యెమెన్ వెళ్ళి, అక్కడి ప్రవాస భారతీయుల సహకారంతో పనిచేస్తున్నారు. యెమెన్‌లోని ఇస్లామిక్ చట్టం ప్రకారం బాధితుడి కుటుంబానికి పరిహారం (బ్లడ్ మనీ) చెల్లించడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
నిమిషకు సహాయం చేయడం కోసం కేరళలోని నెన్మారా ప్రాంత ఎమ్మెల్యే కె బాబు సుమారు 40వేల డాలర్లు సమీకరించారు. కానీ మృతుడి కుటుంబాన్ని ఒప్పించడానికి నిమిష తల్లి సెప్టెంబర్ వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
నిమిష స్వస్థలం కేరళ పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెన్గోడ్. ఆమె తల్లిదండ్రులు రోజుకూలీలు. నిమిష 2008లో యెమెన్ వెళ్ళింది. అక్కడ ఒక స్థానిక వ్యాపార భాగస్వామితో కలిసి క్లినిక్ ప్రారంభించాలని ప్రణాళికలు వేసుకుంది. అయితే వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహిదీతో గొడవలు వచ్చాయి. 2017లో అతని వద్దనున్న తన పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోడానికి నిమిష ప్రయత్నించింది. అందులో భాగంగా అతనికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చింది. అయితే అవి ఓవర్‌డోస్ అవడంతో మహిదీ చనిపోయాడు. నిమిష యెమెన్ విడిచి పారిపోడానికి ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్ట్ చేసారు. 2018లో ఆమెపై నేరం నిరూపితమైంది. సనా నగరంలోని ట్రయల్ కోర్ట్ ఆమెకు 2020లో మరణశిక్ష విధించింది.