దేవాలయాలకు స్వయంప్రతిపత్తి లక్ష్యంగా జనవరి 5న విజయవాడ శివార్లలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ పేరిట బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆ సభకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.
హైందవ శంఖారావం కన్వీనర్ మరియు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవి కుమార్, కోశాధ్యక్షులు వలివర్తి దుర్గాప్రసాద్ రాజు, సంస్థ కేంద్రీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు తదితరులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. శంఖారావం సభకు ఆహ్వానించడంతో పాటు దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పరిషత్ రూపొందించిన నమూనా ముసాయిదాను కూడా అందజేసారు.
హిందువుల ధార్మిక వ్యవస్థను భ్రష్టు పట్టించే దురుద్దేశంతో దేవాలయాలపై పాలకుల పెత్తనానికి ముస్లిం నవాబుల సమయంలోనే బీజం పడింది. వారి తర్వాత బ్రిటిష్ వారు సైతం అదే విధానాన్ని కొనసాగించారు. దేశానికి స్వతంత్రం వచ్చాక మన స్వంత ప్రభుత్వాలు అదే పద్ధతిని మరింత విస్తరించి దేవదాయ ధర్మదాయ శాఖ ఏర్పాటు చేసారు. వాటి ద్వారా అడుగడుగునా భక్తులను దోచేస్తున్నారు. అదే సమయంలో భక్తులు తమ ఇష్టదైవాలకు సమర్పించుకున్న నిధులను అదే శాఖ ద్వారా కబ్జా చేస్తున్నారు. ఆలయాల నిర్వహణ భక్తిప్రపత్తులతో కాకుండా రాజకీయ పునరావాస కేంద్రాల ద్వారా నడుస్తోంది. అలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది.
పరిషత్ రూపొందించిన నమూనా ముసాయిదాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం ద్వారా పరిషత్ హిందువుల ఆకాంక్షలను ఏలికలకు తెలియజేస్తోంది. ఆ క్రమంలోనే పరిషత్ రాష్ట్ర పెద్దలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా కలిసి, శంఖారావ సభకు ఆహ్వానించారు.