బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్రికెట్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్ ఐదవ-ఆఖరి రోజు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. 184 పరుగుల ఆధిక్యంతో భారత్‌పై విజయం సాధించింది. ఈ ఓటమితో, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరుకునేందుకు భారత్ అవకాశాలు సన్నగిల్లాయి.
భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 340 పరుగుల లక్ష్యంతో ప్రారంభించింది. కానీ 155 పరుగులకే ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ దాదాపు ఒంటరి పోరాటం చేసాడు. 84 పరుగులు సాధించిన జైస్వాల్, ఒక వివాదాస్పద నిర్ణయంతో ఔట్ అయ్యాడు.
ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో మూడు వికెట్లు తీసారు. నాథన్ లియాన్ రెండు వికెట్లు సాధించాడు. ఈ టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. కమిన్స్ మొదటి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసాడు, 3 వికెట్లు తీసాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో మరో 41 పరుగులు సాధించాడు.
అంతకుముందు, ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఉదయం ఆటను 228/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో మొదలుపెట్టింది. 234 పరుగుల వద్ద చివరి వికెట్ కోల్పోయింది. భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు సాధించాడు.
మొదటి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌తో మొదలైంది. స్టీవెన్ స్మిత్ 140 పరుగులతో ఆతిథ్య జట్టు 474 స్కోర్ సాధించింది. దానికి జవాబుగా భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎయిత్ డౌన్లో వచ్చి 114 పరుగులు సాధించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
ఈ ఐదు మ్యాచ్‌ల సీరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పుడు 2-1 ఆధిక్యంతో నిలిచింది. ఆఖరి-ఐదవ టెస్ట్ సిడ్నీలో జనవరి 3నుంచి మొదలవుతుంది. ఆ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిస్తేనే భారత్‌కు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.