పుష్ప-2 సినిమా ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ వంటి పరిణామాలపై ప్రముఖ సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటిసారి స్పందించారు. గోటితో పోయే విషయాన్ని గొడ్డలి వరకూ తెచ్చారని అభిప్రాయపడ్డారు.
‘‘అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, తెర వెనుక ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం వల్లే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. అక్కడ బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చారు, టికెట్ల ధరలు పెంచుకోడానికీ అవకాశం కల్పించారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనల్లో పోలీసులు అందరి భద్రత గురించే ఆలోచిస్తారు, వాళ్ళను తప్పుపట్టను. అల్లు అర్జున్‌కు థియేటర్ సిబ్బంది ముందు చెప్పి ఉండాల్సింది, లేదా ఆయన సీట్లో కూర్చున్న తర్వాత అయినా చెప్పి బైటకు తీసుకువెళ్ళాల్సింది’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ మధ్యాహ్నం మీడియాతో ముచ్చటించారు.
‘‘ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా బాధ కలిగించింది. అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం దగ్గరకు ముందుగానే వెళ్ళిఉంటే బాగుండేది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. బాధిత కుటుంబానికి అందరం అండగా ఉన్నామని ముందే చెప్పిఉండాల్సింది. ఎవరి ప్రమేయమూ లేకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి ఉండాల్సింది. విషయం తెలిసిన వెంటనే రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవడం వల్లనే ప్రజల్లో అంతగా ఆగ్రహం వ్యక్తమైంది’’ అని పీకే భావించారు.
‘‘అల్లు అర్జున్ తన వల్ల ఒకరు చనిపోయారని చాలా ఆవేదన చెందారు. కానీ అర్జున్ ఒక్కరినే దోషిగా చూపడమూ సరికాదు. సినిమా అనేది అందరి భాగస్వామ్యంతో ఉండేది. ఆరోజు దుర్ఘటన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం హోదాలో స్పందించారు. సినిమా వేడుకలో రేవంత్ రెడ్డి పేరు చెప్పనందునే ఇలా చేసారని నేను అనుకోవడం లేదు. అలాంటి వాటికి మించిన నాయకుడు ఆయన. రేవంత్‌కు రాంచరణ్, అల్లు అర్జున్ చిన్నతనం నుంచీ తెలుసు. అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా. కాకపోతే, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి’’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసారు.