పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యం కుంభకోణంలో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మచిలీపట్నం సమీపంలో పేర్ని జయసుధకు చెందిన గిడ్డంగుల్లో మొదట 185 టన్నుల బియ్యం మాయమయ్యాయని కేసు నమోదైంది. ఇందుకు రూ.1.68 కోట్ల పెనాల్టీ వేశారు. ఈ మొత్తాన్ని పేర్ని నాని ప్రభుత్వానికి చెల్లించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.
తాజాగా జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మొత్తం 378 టన్నుల బియ్యం మాయమైనట్లు గుర్తించారు. ఇందుకు మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం 7 వేల బస్తాలకుపైగా బియ్యం మాయమైనట్లు తాజా విచారణలో వెల్లడైంది. దీంతో పౌరసరఫరాల శాఖ మచిలీపట్నం మేనేజర్ కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేర్ని నాని గిడ్డంగుల వ్యవహారాలు చూస్తోన్న తేజను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో గిడ్డంగుల్లో బియ్యం మాయంపై ఆడిట్ జరుగుతోంది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోనూ 2 వేల బస్తాల బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఇంకా ఆడిట్ కొనసాగుతోంది. ఆడిట్ పూర్తైన తరవాత ఏ గిడ్డంగిలో ఎంత బియ్యం మాయమైందో ప్రభుత్వం వెల్లడించనుంది.