భారత కార్మికులకు ఇజ్రాయెల్ రెడ్ కార్పెట్‌తో ఆహ్వానం పలుకుతోంది. పాలస్తీనాతో యుద్దంతో ఆ దేశానికి చెందిన కార్మికులను ఇజ్రాయెల్ వెనక్కు పంపింది. దీంతో ఇజ్రాయెల్‌లో నిర్మాణ రంగం కుదేలైంది. వెంటనే భారత్, చైనా నుంచి 30 వేల మంది కార్మికులను ఇజ్రాయెల్ తీసుకుంది. భారత్ నుంచి 16 వేల మంది ఇజ్రాయెల్ దేశంలో నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. మన దేశంలో వచ్చే జీతం కన్నా 300 రెట్లు అధికంగా ఆదాయం వస్తోందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిన్నరగా యుద్ధం సాగుతున్నా కార్మికులు భయపడకుండా ఇజ్రాయెల్‌లో పని చేస్తున్నారు. మరో 20 వేల మంది భారత్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లడానికి సిద్దమవుతున్నారని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఒకటి ప్రకటించింది. భారత్ ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు మెరుగ్గా ఉండటంతో అక్కడ మన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని ఇప్పటికే వెళ్లిన కార్మికులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్‌పై నిరంతరం దాడులు జరుగుతున్నా నిర్మాణరంగంలో పనులు మాత్రం నిలిచిపోలేదు. పాలస్తీనా కార్మికుల స్థానంలో భారత్, చైనా కార్మికులతో ఇజ్రాయెల్ భారీ నిర్మాణాలు చేపట్టింది. రాబోయే రోజుల్లో మొత్తం లక్ష మంది కార్మికులను తీసుకునేందుకు ఇజ్రాయెల్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని డైనమిక్ స్టాఫింగ్ సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్‌తో వృద్ధులకు సేవలు అందించే కేర్ టేకర్స్ ఉద్యోగాలకు కూడా పెద్ద ఎత్తున అవసరం ఉందని స్టాఫింగ్ సంస్థ అధిపతి వెల్లడించారు.