ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని ఇందిరా నగర్ ప్రాంతంలో నిన్న అక్రమ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. దాన్ని అడ్డుకునే క్రమంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న సుమారు 200 మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు మునిసిపాలిటీ సిబ్బంది మీద దాడి చేసారు. మునిసిపల్ సూపర్వైజర్ మీనాక్షి నేతృత్వంలోని బృందాన్ని కర్రలతో చితకబాదారు. ఆ దాడిలో గాయపడిన మునిసిపల్ సిబ్బందిని అక్కడినుంచి తరిమికొట్టారు.
ఆ క్రమంలో మునిసిపల్ సిబ్బంది వస్తువులు చాలా పోయాయి. ఒక బంగారు గొలుసు, మరికొన్ని మొబైల్ ఫోన్లను బంగ్లాదేశీ మూక లాగేసుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునిసిపల్ శాఖ అధికారులు డిమాలిషన్ డ్రైవ్ చేపట్టారు. బంగ్లాదేశీ చొరబాటుదారులు అక్కడ అక్రమంగా కట్టుకున్న కనీసం 50 నివాసాలను కూల్చివేసారు. ఇక మునిసిపల్ సిబ్బంది మీద దాడిచేసిన మూక మీద కేసు నమోదయింది.
లఖ్‌నవూలోని ఘోడే వాలే మందిర్ దగ్గర బంగ్లాదేశీ చొరబాటుదారులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న చేతి బళ్ళను తీసివేసే కార్యక్రమం ఆదివారం ఉదయం 7గంటలకు మొదలైంది. అక్కడ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు చెత్తను అనధికారికంగా సేకరించి కుప్పలు పెడుతుండడంతో సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసారు. దానికి స్పందించిన మునిసిపల్ శాఖ, అక్రమ చెత్తబళ్ళ తొలగింపు మొదలుపెట్టింది. అది చూసిన ఒక బంగ్లాదేశీ మహిళ ఫోన్ చేసి తమవారికి సమాచారం ఇచ్చింది. నిమిషాల్లో సుమారు 200మంది బంగ్లాదేశీయులు అక్కడ గుమిగూడి కర్రలతో మునిసిపల్ సిబ్బంది మీద దాడి చేసారు.
బంగ్లాదేశీ చొరబాటుదారులు మునిసిపల్ సూపర్వైజర్ మీనాక్షి మీద దాడి చేసారు. ఆమె దుస్తులు చింపేసారు. ఆమె మెడలోని బంగారు గొలుసు తెంపేసి దొంగతనం చేసారు. ఇద్దరు మునిసిపల్ కార్మికుల ఫోన్లు దొంగిలించారు. మునిసిపల్ సిబ్బంది వాహనాలను ధ్వంసం చేసారు. వారిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు.
విషయం తెలుసుకున్న నగర మేయర్ సుష్మా ఖరక్వాల్ వెంటనే రంగంలోకి దిగారు. పోలీస్ జాయింట్ కమిషనర్ అమిత్ వర్మ, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శ్రీవాస్తవతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బంగ్లాదేశీయులు అక్రమంగా కట్టుకున్న ఇళ్ళకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు గమనించిన మేయర్, విద్యుత్ శాఖ ఉద్యోగులను పిలిపించారు. అక్కడున్న అక్రమ విద్యుత్ కనెక్షన్లను వెంటనే తీయించివేసారు. ఆ ప్రాంతంలో బంగ్లాదేశీయులు అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
ఈసారి పోలీసుల భద్రత నడుమ మునిసిపల్ సిబ్బంది సుమారు 50 అక్రమ నిర్మాణాలను కూల్చేసారు. ఆదివారం మధ్యాహ్నానికల్లా పని పూర్తయిపోయింది. అక్కడ ఉంటూ వచ్చినవారు తమ వస్తువులను వాహనాల మీద తీసుకుని వేరే చోట్లకు వెళ్ళిపోయారు. మరోవైపు, మునిసిపల్ సిబ్బంది మీద దాడి చేసినందుకు కేసు నమోదయింది.