కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలనుకుంటున్న భారతీయ ముస్లిములకు దుర్వార్త. కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవడం హరామ్ అని, ఆ సంబరాలు చేసుకోకూడదని ఫత్వా జారీ అయింది. ఆంగ్ల సంవత్సరం ముస్లిమేతరులకు పండుగ కాబట్టి భారతదేశంలోని ముస్లిములు ఆ పండుగ చేసుకోకూడదంటూ ఆల్ ఇండియా ముస్లిమ్ జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ శహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఫత్వా జారీ చేసారు.
ఇస్లాంలో పాటలు పాడడం, నాట్యాలు చేయడం హరామ్ (నిషిద్ధం). కాబట్టి కొత్త సంవత్సరం వేడుకలు కూడా నిషిద్ధమే. షరియత్ ప్రకారం అది నేరపూరిత చర్య అవుతుంది. అందువల్ల అలాంటి వేడుకల్లో ముస్లిం యువత పాల్గొనకూడదు అని ఆ ఫత్వాలో మౌలానా రజ్వీ చెప్పుకొచ్చారు.
కొత్త సంవత్సరం అనేది క్రైస్తవుల పండుగ. కాబట్టి దాన్ని వేడుకగా జరుపుకోవడం ముస్లిములకు చట్టవిరుద్ధం. ఈ పండుగ ఇంగ్లీషువారి కొత్త సంవత్సరం పండుగ అనేది క్రైస్తవుల మతానికి సంబంధించిన వేడుక. ఆ సందర్భంగా క్రైస్తవులు వాళ్ళ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కాబట్టి వాటిలో ముస్లిములు పాల్గొనడం కచ్చితంగా నిషిద్ధం అని మౌలానా రజ్వీ ఆ ఫత్వాలో వివరించారు.
కొత్త యేడాది సందర్భంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటిలో జనాలు పాటలు పాడతారు, నాట్యాలు చేస్తారు, బాణాసంచా కాలుస్తారు, మద్యం సేవిస్తారు, జూదం ఆడతారు, చప్పట్లు కొట్టి ఈలలు వేస్తారు. అవన్నీ ఇస్లామిక్ షరియా ప్రకారం చట్టవిరుద్ధం. కాబట్టి అలాంటి వాటిలో ముస్లిములు పాల్గొనడం ఘోరమైన నేరం. కాబట్టి వాటికి ముస్లిములు దూరంగా ఉండాలి. షరియాకు విరుద్ధమైన అలాంటి పనుల్లో పాల్గొనే వ్యక్తి నేరస్తుడవుతాడు అని మౌలానా రజ్వీ తన ఫత్వాలో స్పష్టంగా చెప్పారు.