నాలుగు దశాబ్దాల కిందట విషవాయువులు లీకై వేలాది మందిని పొట్టన బెట్టుకున్న కర్మాగారం నుంచి 337 టన్నుల విష పదార్థాలను తరలించే ప్రక్రియ మొదలైంది. భోపాల్ యూనియన్ కార్బైడ్ మందుల తయారీ కర్మాగారం నుంచి పదేళ్ల కిందట 10 టన్నుల విష పదార్థాలను ఇండోర్ సమీపంలోని పీతంపూర్‌కు తరలించి కాల్చివేశారు. ఆ బూడిదను భూ స్థాపితం చేశారు. తాజాగా మరో 337 టన్నుల విష పదార్థాలను రక్షణ కలిగిన కంటెయినర్లలో తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్మాగారం వద్ద ఎత్తున పోలీసు బలగాలను రక్షణగా ఏర్పాటు చేశారు.
విష పదార్థాలు కాల్చివేసి భూమికి ఆనించకుండా భూగర్భంలో నిక్షిప్తం చేస్తామని అధికారులు చెబుతున్నారు. పదేళ్ల కిందట విష పదార్థాల బూడిదను భూస్థాపితం చేయడం వల్ల తమకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయని పీతంపూర్ ప్రజల ఆందోళన చేస్తున్నారు. పీతంపూర్‌లో లక్షా 70 వేల మంది నివసిస్తున్నారు. వారంతా ఆందోళన చెందుతున్నారు.
1984 డిసెంబరు 3 అర్థరాత్రి కాళరాత్రిగా మారింది. యూనియన్ కార్బైడ్ మందుల కంపెనీ నుంచి విష వాయువులు లీకై చుట్టుపక్కల కాలనీలకు వ్యాపించింది. దీంతో పది వేల మంది వెంటనే చనిపోయారు. మరో 25 వేలమంది తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు. 6 లక్షల మంది అంగవైకల్యంతో కాలం గడుపుతున్నారు. కంపెనీ ఛైర్మన్ అండర్సన్ అమెరికా నుంచి ప్రమాదం జరిగిన కంపెనీ వద్దకు చేరుకోగానే పోలీసులు రక్షణ కల్పించారు. అండర్సన్ కోర్టులో పిటిషన్ వేసుకుని రూ.25వేల పూచీకత్తుతో అరెస్టునుంచి తప్పించుకున్నాడు. అర్థరాత్రి ప్రత్యేక విమానంలో అమెరికాకు పారిపోయిన విషయం తెలిసిందే.