కేరళకు చెందిన సినీ, టెలివిజన్ నటుడు దిలీప్ శంకర్ ఆదివారం నాడు అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడు. 47ఏళ్ళ దిలీప్ శంకర్ తిరువనంతపురంలో ఒక హోటల్ రూమ్‌లో శవమై కనిపించాడు.
దిలీప్ శంకర్ రెండు రోజులకు ముందే ఆ హోటల్లో దిగాడు. అయితే చెకిన్ అయిన తర్వాత అతను అసలు బైటకే రాలేదు. హోటల్ రూమ్‌కే పరిమితమయ్యాడు. గదిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆదివారం నాడు హోటల్ స్టాఫ్‌కు అనుమానం వచ్చింది. ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దాంతో హోటల్ స్టాఫ్ ఆ గదిలోకి వెళ్ళి చూడగా దిలీప్ శవమై కనిపించాడు.
హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికే హోటల్ చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు.
దిలీప్ శంకర్ మరణానికి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రాథమిక పరిశీలన ప్రకారం దిలీప్ మృతి వెనుక ఎలాంటి తప్పుడు జోక్యమూ లేదని తేలింది. అయితే, మృతికి కచ్చితమైన కారణమేంటో తెలుసుకోడానికి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
ఎర్నాకుళం నగరానికి చెందిన దిలీప్ శంకర్, ఒక టీవీ సీరియల్ షూటింగ్ కోసం తిరువనంతపురం వెళ్ళాడు. షూటింగ్లో రెండు రోజుల బ్రేక్ వచ్చింది. ఆ రెండు రోజులూ దిలీప్ హోటల్లోనే ఉండిపోయాడు. ఒక్కసారి కూడా బైటకు రాలేదు. దిలీప్ శంకర్ కొన్నాళ్ళుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.