ప్రజావేగు సుచిర్ బాలాజీ మరణంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనుమానాలు వ్యక్తం చేశారు. బాలాజీ మరణం ఆత్మహత్యలా లేదని ఆయన వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలను భారత సంతతి అమెరికా నేత వివేక్ రామస్వామితోపాటు, అమెరికాలోని భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. ఇది పెద్ద చర్చకు దారితీసింది. నవంబరు 26న శాన్‌ఫ్రాన్సికోలో తన అపార్టుమెంటు ఫ్లాటులో సుచిర్ బాలాజీ అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి, విచారించిన పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. దీనిపై సుచిర్ బాలాజీ తల్లి పూరణిమారావ్ అనుమానాలు వ్యక్తం చేశారు.
అమెరికా పోలీసులు సుచిర్ బాలాజీకి పోస్టుమార్టం నిర్వహించారు. ఆత్మహత్యగా తేల్చి శవాన్ని తల్లికి అప్పగించగా, ఆమె ప్రైవేటు డిటిక్టివ్‌ల ద్వారా మరోసారి పోర్టుమార్టం చేయించారు. అమెరికా పోలీసులు ఇచ్చిన రిపోర్టు, ప్రైవేటు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టుకు భిన్నంగా వచ్చిందని పూర్ణిమా చెప్పారు. ఎఫ్‌బిఐతో దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. సుచిర్ బాలాజీది ఆత్మహత్య కాదని, కొట్టిచంపినట్లు రిపోర్టులో తేలిందని పూర్ణిమా చెబుతున్నారు. సుచిర్ బాలాజీ మరణంపై ఎలాన్ మస్క్ కూడా అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీసింది.
సుచిర్ బాలాజీ చాట్ జీపీటీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో నాలుగేళ్లు పనిచేశారు. 2024 ఆగష్టులో అందులో నుంచి బయటకు వచ్చేశారు. సమాజానికి నష్టం చూకూర్చేలా చాట్ జీపీటీ రూపొందించారని, అలాంటి వాటిల్లో తాను పనిచేయదలచు కోలేదని సంచన ఆరోపణలు చేశారు. కాపీరైట్ పొందడంలోనూ చాట్ జీపీటీ నిబంధనలను ఉల్లంఘించిందని సుచిర్ బాలాజీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
తాజాగా సుచిర్ బాలాజీని కొందరు కొట్టి చంపారని అతని తల్లి పూర్ణిమా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శాన్‌ప్రాన్సిస్‌కోలోని బాలాజీ గదిలో, బాత్ రూములో రక్తపు మరకలు కూడా గుర్తించినట్లు ఆమె చెబుతున్నారు.