పాకిస్తాన్ పై రెండు వికెట్ల తేడాతో గెలుపుతో అర్హత
వచ్చే ఏడాది జూన్ లో లార్డ్స్ వేదికగా ఫైనల్
ప్రత్యర్థి స్థానం కోసం భారత్, ఆసీస్ మధ్య పోటీ
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)-25 ఫైనల్‌కు అర్హత సాధించింది. సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్ట్ లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో తొలిసారి WTC ఫైనల్ లోకి దక్షిణాఫ్రికా అడుగుపెట్టింది.
ప్రస్తుత డబ్ల్యూటీసీ ర్యాంకుల పట్టికలో66.67 విజయశాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్ధానంలో ఉంది. సీజన్ లో 11 మ్యాచ్‌లు ఆడిన ప్రోటీస్ ఏడు మ్యాచుల్లో గెలిచింది. మూడు మ్యాచుల్లో ఓడగా మరోదాంట్లో ఫలితతం డ్రాగా తేలింది. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను కూడా సఫారీలు 2- 0తో కైవసం చేసుకున్నారు.
WTC ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా తొలి బెర్త్ ను ఖాయం చేసుకోగా మరో స్థానం కోసం భారత్, ఆసీస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భారత్ ఫైనల్ కు చేరి సఫారీలతో తలపడాలంటే బీజీటీ ట్రోఫీలోని నాలుగు, ఐదు టెస్టుల్లో విజయం సాధించాలి. ఆసీస్, శ్రీలంకల మధ్య జరగనున్న సిరీస్ లో గెలుపోటములు కూడా సెకండ్ ఫైనలిస్ట్ లెక్కలను తారుమారు చేస్తాయి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆసీస్ 58.89 శాతంతో రెండో స్థానంలో ఉండగా, భారత్ 55. 88శాతంతో మూడో స్థానంలో ఉంది. న్యూజీలాండ్, శ్రీలంక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
పాకిస్తాన్ పై దక్షిణాఫ్రికా గెలుపు ఇలా
పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. దక్షిణాఫ్రికా 148 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 27/3తో ఆదివారం నాడు నాలుగో రోజు ఆటను ప్రారంభించి విజయం సాధించింది. మార్‌క్రమ్ (37), తెంబా బావుమా (40) రాణించడంతో గెలవగల్గింది.
ఓ దశలో 93/4 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ కాసేపటికే 12 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు నష్టపోయింది. దీంతో మ్యాచ్ రసకందకాయంలో పడింది. టెయిలెండర్ కగిసో రబాడ 26 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మార్కో యాన్సెన్ (16) విన్నింగ్ షాట్ కొట్టాడు.
పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ 6 వికెట్లు తీసి సఫారీలను నానా ఇబ్బందులకు గురిచేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 237 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజం ( 50), సౌద్ షకీల్ ( 84) అర్ధసెంచరీలు చేశారు. సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయగా, ఛేదనలో పాకిస్తాన్ 211 పరుగులకే ఆలౌటైంది.
ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 న కేప్‌టౌన్ వేదికగా ప్రారంభం కానుంది.