కాంగ్రెస్ పార్టీ పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ఇతరులపై ఇష్టానుసారం ఆరోపణలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించిన విషయంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం పై అభాండాలు వేశారు. కాంగ్రెస్ తీరు దురదృష్టకరమన్న ప్రహ్లాద్ జోషి, గాంధీయేతర కాంగ్రెస్ నేతలను గాంధీ కుటంబుం ఎన్నడూ గౌరవించలేదన్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుచేయలేదని ఆయన కుమార్తె శర్మిష్ఠా విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కూడా కాంగ్రెస్ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేదని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఎన్డీయే కు సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, అతను అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అన్నారు.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే స్మారక స్థలం నిర్మించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని కోరారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు దిల్లీలోని అతి పురాతనమైన నిగంబోధ్ శ్మశానవాటిక లో నిర్వహించారు. యమునా నది తీరాన ఉన్న ఈ స్వర్గధామాన్ని ఇంద్రప్రస్థ రాజు యుధిష్ఠిరుడు ఏర్పాటు చేశారని చెబుతుంటారు.
1950లోనే ఇక్కడ విద్యుత్ దహన వాటికను ఏర్పాటు చేయగా 2000 సంవత్సరం మొదట్లో సీఎన్జీ ఆధారిత దహన వాటికను నిర్మించారు. 1898లో షాజనాబాద్గా దిల్లీ ఉన్నప్పుడు వైశ్య ప్రముఖుడు బిసా అగర్వాల్ నిగంబోధ్ శ్మశాన వాటికను కట్టించారు. గతంలో ఈ ప్రాంతంలో వైశ్య ప్రముఖులు ఎక్కువగా వ్యాపారాలు చేసేవారు.