ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఊచకోత మొదలైంది. అనూహ్యంగా కర్క్స్ ప్రాంతాన్ని ఇటీవల ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత రష్యాలోని ప్రాంతాన్ని ఆక్రమించిన మొదటి దేశం తమదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు. అంతలోనే వారి ఆనందం ఆవిరైంది.
కర్క్స్ ప్రాంతంలోని ఉక్రెయిన్ సైనికులపై రష్యా సైనికులు భీకర దాడులకు దిగారు. గుక్కతిప్పుకోకుండా దాడి చేయడంతో ఉక్రెయిన్ దళాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రష్యన్ సైనికులను ఉక్రెయిన్ దళాలు తిప్పికొట్టలేకపోతున్నాయి.ఈ దాడిలో రష్యాతోపాటు, ఉత్తర కొరియా సైనికులు కూడా 50 వేల మంది దాకా పాల్గొన్నారని తెలుస్తోంది.
రష్యా దాడితో కర్క్స్ ప్రాంతంలో వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. చివరకు అధికారుల ఆదేశాలను కూడా ఉక్రెయిన్ దళాలు పాటించడం లేదని తెలుస్తోంది. 984 చదరపు కి.మీ భూమిలో 40 శాతం దాకా ఉక్రెయిన్ కోల్పోయింది. కొద్ది రోజుల్లోనే కర్క్స్ ప్రాంతాన్ని రష్యా ఆధీనంలోకి తీసుకోబోతోందని తెలుస్తోంది. రష్యా భీకర దాడితో ఉక్రెయిన్ సైనికులు యుద్ధం చేసే పరిస్థితుల్లో కూడా లేరనే విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.