మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్ లో ప్రజలతో పలు విషయాలు పంచుకున్న ప్రధాని మోదీ
తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి నటుడు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రతీ నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం 117వ ఎసిపోడ్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ , అక్కినేని నాగేశ్వరరావు గురించి పలు విషయాలను శ్రోతలతో పంచుకున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ అక్కినేనిని స్మరించుకున్నారు.
భారతీయ సంప్రదాయాలు, విలువలను అక్కినేని నాగేశ్వరరావు తన సినిమాల్లో చాలా చక్కగా చూపించేవారని గుర్తు చేసుకున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా, సినిమా పరిశ్రమ అభివృద్ధికి విలువైన సేవలు అందించారని ప్రశంసించారు. నటుడు రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు.
వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌ను భారత్ లో తొలిసారిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని దానిని దేశ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు అయిన సందర్భంగా దాని గురించి కూడా మాట్లాడారు. 75 ఏళ్ల సంబరాల్లో భాగంగా అనేక భారతీయ భాషల్లో రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ పీఠిక, ఇతర అంశాలు చదివి అర్థం కాని వాటిపై ప్రశ్నలు సైతం అడగవచ్చు అని తెలిపారు.
ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి జరగనున్న మహాకుంభ మేళాను ఐక్యతా మేళాగా అభివర్ణించిన మోదీ, భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్ (AI) పదకొండు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు. డిజిటల్ నావిగేషన్ సహాయంతో భక్తులు కుంభమేళాలోని వివిధ ఘాట్లు, దేవాలయాలు, సాధువుల శిబిరాల చేరుకునేందుకు వీలుంటుందన్నారు.