బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు అదరగొట్టారు. టీ విరామ సమయానికే ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. నాలుగోరోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్( 8)ను బుమ్రా, వెనక్కి పంపగా, ఉస్మాన్ ఖవాజా(21)ను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పెవిలియన్ చేరాడు. దీంతో స్కోర్ బోర్డు 83 పరుగులు వద్ద ఉన్నప్పుడు ఆసీస్ మూడో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, బూమ్రా బౌలింగ్ లో ఒక పరుగు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ డకౌట్ గా వెనుదిరిగాడు.
వీకెట్ కీపర్ అలెక్స్ కేరీని కూడా బూమ్రా బౌల్డ్ చేయడంతో ఆసీస్ 91 పరుగులు వద్ద ఆరో వికెట్ నష్టపోయింది.
భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 70 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళుతున్న లబుషేన్ ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. లబుషేన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 139 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ ను రిషబ్ పంత్ రన్ ఔట్ చేయడంతో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోగా, కెప్టెన్ పాట్ కమిన్స్ (41)ని రవీంద్ర జడేజా ఔట్ చేయడంతో ఆసీస్, 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 228 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 333 పరుగుల లీడ్‌లో ఉంది. నాథన్ లైయన్(41*), బోలాండ్ (10*) క్రీజులో ఉన్నారు. ఆఖరి వికెట్ కోసం భారత్ కష్టపడినప్పటికీ ఫలితం దక్కలేదు.
మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 పరుగులు చేయగా భారత్ 369 వద్ద ఆలౌటైంది.
నాలుగో రోజు ఆటలో భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు కొనసాగలేదు. దీంతో 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ లియన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 369 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది.