కశ్మీర్ లోయలో హిమపాతం
భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, దిల్లీలో సోమవారం నుంచి నాలుగు రోజులపాటు తీవ్రమైన చలివాతావరణం ఉంటుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి వాతావరణం (కోల్డ్‌వేవ్) ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు,పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోతాయని ప్రకటనలో వివరించింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు మంచు(Snow) కురుస్తుందని తెలిపింది.
కశ్మీర్‌లో మంచు ప్రభావంతో ఇప్పటికే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు, రైళ్లు ఇప్పటికే రద్దు అయ్యాయి. శ్రీనగర్ -జమ్మూ జాతీయ రహదారి సహా పలు రోడ్లను మూసివేశారు. పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
దిల్లీలో చలివాతావరణంతో పాటు రెండురోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
శనివారం ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలో దిల్లీలో 41.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. 1923 డిసెంబరు 3న కురిసిన 75.7 మి.మీ. వర్షపాతం తర్వాత డిసెంబరులో ఈ స్థాయిలో కురవడం ఇదే ప్రథమం.