హెచ్ 1 బి వీసాలకు తాను వ్యతిరేకం కాదని త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికాను ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉంచాలనేదే తన లక్ష్యమని ట్రంప్ చెప్పారు. అమెరికాలో అంతగా నైపుణ్యం లేని విద్యావంతులు ఉన్నారని, నైపుణ్యమైన సిబ్బంది ఎక్కడ ఉన్నా తీసుకునే అవకాశం కల్పిస్తామని ట్రంప్ చెప్పారు. వీసాల నియంత్రణపై అమెరికాలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ట్రంప్ అధికారం చేపడితే హెచ్ 1 బి వీసాలు నియంత్రిస్తాడనే ప్రచారం సాగుతోంది.ట్రంప్ తాజా వ్యాఖ్యలతో వీసాల జారీపై కొంత స్పష్టత వచ్చినట్లైంది.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇచ్చే ఎఫ్ 1 వీసాలను హెచ్ 1 బిగా మార్చేందుకు కూడా తనకు అభ్యంతరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన క్యాబినెట్లో కీలక సంస్కరణ శాఖకు మంత్రిగా ప్రమాణం చేయబోతోన్న ఎలాన్ మస్క్ కూడా అమెరికాకు హెచ్ 1బి వీసాపైనే వచ్చాడని ట్రంప్ గుర్తు చేశారు.
అమెరికా అక్రమ వలసలకు మాత్రమే వ్యతిరేకమని నైపుణ్యం కలిగిన వారు ఎక్కడున్నా తీసుకుంటామని ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్ అయింది. అమెరికాలో వలసల వల్ల స్థానికుల్లో నిరుద్యోగం పెరుగుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో ట్రంప్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.