సాలూరు, మక్కువ, గరివిడి మండలాల్లో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిపిన పర్యటనలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ పర్యటనలో హల్‌చల్ చేసిన నకిలీ ఐపీఎస్‌ను పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. మీడియాలో అతని ఫోటోలు రావడంతో స్థానికులు గుర్తించారు. దీంతో సూర్యప్రకాష్ బండారం బయట పడింది.
నిందితుడు బలిమెళ సూర్యాప్రకాష్‌ను సాలూరు కోర్టులో హాజరు పరిచినట్లు దిలీప్ కిరణ్, అంకిత సురానా మీడియాకు వెల్లడించారు. అతని తండ్రి 2009లో ఒకరి వద్ద నుంచి 9 ఎకరాలు కొనుగోలుకు ఒప్పందం రాయించుకున్నారు. తరవాత అతను చనిపోయారు. 2020లో ఐపీఎస్ ఉద్యోగం వచ్చినట్లు సమీప ప్రాంతాల్లో ప్రచారం చేసుకున్న సూర్యప్రకాష్, ఆ భూమి కోసం బెదిరించడం ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.
గడసాం గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్ 2003లో ఆర్మీలో సిపాయిగా పనిచేశాడు. తరవాత ఆ ఉద్యోగం వదిలేశాడు. ఇటీవల విజయనగరం వచ్చి ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకుని తిరగడం ప్రారంభించాడు. ఐపీఎస్ అధికారిగా డ్రస్ వేసుకుని ఆ ఫోటోలు చూపించి సెటిల్మెంట్లు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.