విజయవాడ మధురానగర్లో ఒంటరిగా నివసిస్తున్న మూడు లక్ష్మి (62) అనే మహిళ మృతిపై అనుమానంతో డిసెంబర్ 26న ఆమె రెండో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తల్లి ఒంటిపైన ఉండాల్సిన బంగారం పోయిందని పోలీసులకు చెప్పాడు. రూ.4లక్షల విలువైన 49 గ్రాముల బంగారు నగలు పోయాయి. దాంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
సంఘటన జరిగిన రాత్రి మృతురాలి పెద్ద కొడుకు మూడు సాంబశివరావు(43), కోడలు వాణి(35) ఆస్తి కోసం ఆమెతో గొడవ పడ్డారని విచారణలో తెలిసింది. సాంబశివరావు గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర ఆత్మకూరులో ఆటో నడుపుకుంటూ కుటుంబంతో నివసిస్తున్నాడు. లక్ష్మి అంత్యక్రియలకు వారు రాకపోవడంతో వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసారు. డిసెంబర్ 27న విజయవాడ రైల్వేస్టేషన్లో వారు పట్టుబడ్డారు.
సాంబశివరావు పక్షవాతం కారణంగా అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చుకోడానికి తల్లిని ఆస్తిలో వాటా అడగాలనుకున్నాడు. దానికోసం సాంబశివరావు దంపతులు డిసెంబర్ 25న విజయవాడ వెళ్ళారు. ఆస్తి పంచడానికి తల్లి నిరాకరించింది. అర్ధరాత్రి వేళ ఆమె నిద్రలో ఉండగా కొడుకు, కోడలు ఆమెను దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేసారు. ఆమె ఒంటిమీదున్న బంగారు వస్తువులను తీసుకుని ఆ దంపతులు ఆత్మకూరు వెళ్ళిపోయారు.
మర్నాడు తమ్ముడు తల్లి చనిపోయిందని చెప్పాక మళ్ళీ విజయవాడ వచ్చారు. పోలీసులకు తమ్ముడు ఫిర్యాదు చేసాడని తెలిసి, అంత్యక్రియలకు వెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో, హైదరాబాద్కు పారిపోవాలని భావించారు. ఆ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్లో పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వారి నుంచి దొంగసొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు.