అహంకారంతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లను, ఎదురు చెప్పే వారిని దాడి చేసి భయపెట్టడం వైసీపీ నాయకులు నైజంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి చేసిన దాడిని ఖండించారు. ఘటనను అధికార యంత్రాంగం మొత్తం మీద వైసీపీ చేసిన దాడిగా భావిస్తున్నామని మండిపడ్డారు.
అధికారిక విధుల్లో ఉన్న గాలివీడు మండలం ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి సుమారు 20 మంది అనుచరులతో వచ్చి కార్యాలయంలోనే దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ జవహర్ బాబు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కడప పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ , జవహర్ బాబుని కలిసి పరామర్శించారు. జవహర్ బాబుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.
ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్,….విధుల్లో ఉన్న ఎంపీడీవో జవహర్ బాబు పై దాడికి పాల్పడిన వ్యక్తి చట్టం గురించి తెలిసిన వ్యక్తే కావడం బాధాకరమన్నారు. గతంలో ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్ గా ఉన్నారని గుర్తు చేశారు. చట్టాలు గురించి తెలిసిన వ్యక్తి కూడా దాడులకు పాల్పడటం సరికాదన్నారు.
దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడి తల్లి ఎంపీపీగా పని చేస్తున్నారని, ఆమె కార్యాలయ తాళాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.
వైసీపీ నాయకులను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వారి అహంకారం తగ్గలేదన్నారు. సుదర్శన్ రెడ్డి గతంలోనూ అధికారులుపై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు.
పవన్ కళ్యాణ్ వెంట ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ తదితరులు ఉన్నారు.