మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న మహాకుంభమేళా ప్రేక్షకులకు నేత్రపర్వం కానుంది. కుంభమేళాకు హాజరయ్యే భక్తులను మంత్రముగ్ధులను చేసేందుకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం చేయబోతోంది. కుంభమేళా, ప్రయాగరాజ్‌లకు సంబంధించిన పౌరాణిక గాధలను డ్రోన్ షో ద్వారా ప్రదర్శించనుంది.
త్రివేణీ సంగమ క్షేత్రం దగ్గర డ్రోన్ షో నిర్వహిస్తారు. ఆ ప్రదర్శన కోసం 2వేల డ్రోన్స్‌ను ఉపయోగిస్తారు. వాటిలో దీపాలు అమర్చి అవన్నీ గగన వీధిలో వెలిగేలా ప్రదర్శిస్తారు. మహాకుంభమేళా ప్రారంభం, ముగింపు వేడుకల్లో ఈ వెలిగే డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ కానుంది.
‘‘ప్రయాగ మాహాత్మ్యం, మహాకుంభమేళాలకు సంబంధించిన పౌరాణిక గాధలను సుమారు 2వేల డ్రోన్స్ ప్రదర్శిస్తాయి. ఇంకా క్షీరసాగర మథనం వంటి గాధలను కూడా సాయంత్రం వేళల్లో త్రివేణీ సంగమం దగ్గర ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసాము’’ అని జిల్లా పర్యాటక శాఖ అధికారి అపరాజితా సింగ్ చెప్పారు. ప్రయాగ క్షేత్రం ధార్మిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా డ్రోన్ షో ద్వారా వివరిస్తారు.
మహాకుంభమేళా 2025ను అంతర్జాతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవ కార్యక్రమంగా రూపొందించాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ మేరకు ప్రయాగలోని దేవాలయాలు, నదీస్నాన ఘట్టాలు, ఉద్యానవనాలు, రహదారుల సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.
పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈసారి 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రయాగలో ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, జలక్రీడలు, హాట్ ఎయిర్ బెలూన్‌లు, లేజర్ లైట్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. జనవరి ప్రారంభం నుంచీ యమునా నది మీద కాళీఘాట్ దగ్గర మ్యూజికల్ ఫౌంటెన్ లేజర్ షో మొదలవుతుంది. ఇక ఈ లైటింగ్ డ్రోన్ షో అన్ని ప్రదర్శనలకూ తలమానికం కాగలదని యూపీ టూరిజం విభాగం భావిస్తోంది.