బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ ముస్లిం యువతి కనిపించకుండా పోయింది. కొన్నాళ్ళ క్రితం ఆమెను పెళ్ళి చేసుకున్న హిందూ యువకుడు, ఆమె తండ్రిపైనే అనుమానం వ్యక్తం చేసాడు. డిసెంబర్ 23 నుంచి కనబడకుండా పోయిన తన భార్యను వెతికించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్ధించాడు. స్పందించిన కోర్టు, ఆ యువతిని వీలైనంత త్వరగా వెతికి పెట్టాలని పోలీసులను ఆదేశించింది.
ముజఫర్‌పూర్ జిల్లాలోని ఔరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో షమా పర్వీన్ అనే యువతి, లోకేష్ కుమార్ అనే యువకుడు ఇరుగు పొరుగు ఇళ్ళలో ఉండేవారు. బాల్యస్నేహితులైన వారు, తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే షమా కుటుంబం వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. ఈ యేడాది ఆగస్టు 8న ఆమెను సూరత్ పంపించేసారు.
అయితే షమా లోకేష్‌తో ఫోన్ ద్వారా టచ్‌లో ఉంది. డిసెంబర్ 6న లోకేష్ సూరత్ వెళ్ళాడు. అక్కణ్ణుంచి వారిద్దరూ ఢిల్లీ వెళ్ళారు. డిసెంబర్ 9న తీస్‌హజారీ కోర్టులో పెళ్ళి చేసుకున్నారు. తర్వాత హిందూ వివాహ పద్ధతిలో మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. అక్కణ్ణుంచి ఆగ్రా, పట్నా వెళ్ళారు. చివరికి డిసెంబర్ 16న కొత్త దంపతులు స్వగ్రామం చేరుకున్నారు.
ఈలోగా షమా తండ్రి తన కూతురు తప్పిపోయిందంటూ గయ్ఘాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసాడు. కొత్తజంట తమ ఊరికి చేరారని తెలిసిన పోలీసులు డిసెంబర్ 17న షమాను పిలిచి ఆమె స్టేట్మెంట్ తీసుకున్నారు. షమా పోలీసుల ముందు, కోర్టులోనూ తాను మేజర్‌ననీ, ఇష్టపూర్వకంగానే లోకేష్‌ను పెళ్ళి చేసుకున్నాననీ, అతనితోనే ఉంటాననీ చెప్పింది. దాంతో కోర్టు షమాను లోకేష్ ఇంటికి పంపించివేసింది.
ఆ నేపథ్యంలో షమా తల్లిదండ్రులు ఆమెను కలుసుకోవాలని ఉందని, డిసెంబర్ 23న సీతామఢి అనే ఊరికి రావాలనీ పిలిచారు. తల్లిదండ్రులు తన ప్రేమను, పెళ్ళినీ ఒప్పుకున్నారని భావించిన షమా, భర్తతో కలిసి సీతామఢీ వెళ్ళింది. అయితే అక్కడ షమా తల్లిదండ్రులు ఆమెను కారులోకి బలవంతంగా ఎక్కించి తీసుకుపోయారు. దాంతో లోకేష్ దుమ్రా పీఎస్‌లో ఫిర్యాదు చేసాడు. అక్కడ పోలీసులు స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ముజఫర్‌పూర్ కోర్టు షమాను వెతకాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.