ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తలు ఆకాంక్ష
విజయవాడలో ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలు
అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
మహాసభలు ప్రారంభించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
తెలుగు పాలనా భాషగా ఉండాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా రచయితల సంఘం, కాకరపర్తి భావనారాయణ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన ఈ మహాసభలను సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ప్రారంభించారు.
భాషను కాపాడేందుకే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన మండలి బుద్ధ ప్రసాద్, రచయితలందరూ ఒక చోట కలుసుకుని తమ భావాలను పంచుకోవటానికి ఈ మహాసభలు వేదికగా ఉంటాయన్నారు.
హనుమంతునికి తన బలం తెలియనట్టే, రచయితలు కూడా తమ బలాన్ని శక్తినీ మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగునాట గురజాడ, కందుకూరి, వంటి వారు సంస్కరణ పథంలో జాతిని నడిపించిన సంగతి మరచిపోకూడదన్నారు. పరభాష, పర సంస్కృతుల వ్యామోహంలో కొట్టు మిట్టాడుతున్న తెలుగు జాతిని మేల్కొల్పి తనదైన వ్యక్తిత్వంతో ప్రకాశింపచేసింది రచయితలే అని కొనియాడారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలో సమావేశమైన ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు ఆశయాలు సాధించామా అని పరిశీలించాలన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు జనకుడైన పొట్టి శ్రీరాములు కన్న కలలను ఎవరు నెరవేరుస్తున్నారు? మాతృ భాషలో పరిపాలన చేసుకునేందుకు, మాతృ భాషలో చదువుకోవటానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణను మననం చేసుకుని ఆయన ఆశయాలను ఎంతవరకూ నెరవేర్చగలిగామో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ మహనీయుని త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ, ఈ మహాసభలు జరుగుతున్న ఈ ప్రాంగణాన్ని పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంగా పేరు పెట్టినట్లు తెలిపారు.
తెలుగు భాషాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన ఈనాడు సంస్థల స్థాపకుడు చెరుకూరి రామోజీరావు మన మధ్య నుంచి వెళ్లి పోవడం బాధాకరమన్నారు.
యునెస్కో చేసిన సూచనకు అనుగుణంగా రూపొందించిన జాతీయ విద్యావిధానాన్ని తెలుగు ప్రభుత్వాలు అనుసరించాలన్నారు. మాతృభాష తృణీకారం మాతృదేవీ తిరస్కారం అనే నానుడిని ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకోవాలని కోరారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలన్నీ భాషోద్యమానికి ఊపిరి పోసిన చారిత్రాత్మక ఘట్టాలు అని తెలిపారు. ఈ 6వ మహాసభలు మారిన కాలమాన పరిస్థితుల్లో మార్పుని కోరేవారి గొంతుకని సర్వ ప్రపంచానికీ వినిపిస్తున్న మహత్తర సన్నివేశం అన్నారు. దేశ విదేశాల నుండి ఈ సభల కోసం తరలివచ్చిన తెలుగు భాషాభిమానులను అభినందించారు.
‘‘తెలుగు భాషను కాపాడుకుందాం. ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం’’ అనే నినాదంతో ఐక్యత చాటేందుకు ప్రపంచ నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు తెలుపుతున్నట్లు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. తెలుగుభాష పలుకుబడి వినసొంపైనదన్న ఎన్వీ రమణ, సంగీతంలా ఉంటుందన్నారు. సామాన్య ప్రజలు కూడా కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు అని కొనియాడారు.
ఈ సమావేశాల్లో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఏపీ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టడం ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందని ట్వీట్ చేశారు. ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు గారి పేరు పెట్టడం కూడా అభినందనీయమన్నారు. మహా సభలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.