నేపాల్ రాజధాని కాఠ్మాండూ నగర మేయర్ బాలేన్ షా ఆదేశాల మేరకు పాఠశాలల విదేశీ పేర్లను మార్చే ప్రక్రియ మొదలైంది. కాఠ్మాండూ నగరపాలక సంస్థ పరిధిలోని 20 పాఠశాలల పేర్లు మార్చి వాటికి స్వదేశీ పేర్లు పెట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదం వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కొత్త పేర్లు అమల్లోకి వస్తాయి.
సెయింట్ జోసెఫ్ హైస్కూల్ పేరు గురుకులం అని మారుతుంది. సెయింట్ లూయీస్ స్కూల్ పేరు విద్యాసదన్గా మారుతుంది. కొలంబస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇకపై మేధాశ్రీ అవుతుంది. సన్‌షైన్ ఇంగ్లీష్ బోర్డింగ్ స్కూల్ ఇకపై సూర్యకిరణ్ విద్యాలయగా మారుతుంది. ఇంటర్నల్ లైట్ స్కూల్ పేరు వేదశ్రీ విద్యాలయ అవుతుంది. కింగ్ జార్జ్ స్కూల్‌ను ఇకపై సంపద విద్యాలయ అని వ్యవహరిస్తారు.
న్యూ నాలెడ్జ్ స్కూల్ కొత్త పేరు నవజ్ఞాన్ విద్యాలయ. సెయింట్ టాడ్లర్స్ ఇకపై సమర్పణ్ విద్యాసదన్ అవుతుంది. డివైన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు దివ్యజ్ఞాన విద్యాసదనంగా మారుతుంది. హార్మొనీ మాంటిసోరీ స్కూల్ పేరు కల్పవృక్ష విద్యాసదన్గా మారుతుంది. గోల్డెన్ గార్డెన్ స్కూల్ పేరు స్వర్ణిమ్ వాటిక అవుతుంది. హార్ట్‌ల్యాండ్ స్కూల్‌ను ఇకపై హృదయ నికేతన్ అని వ్యవహరిస్తారు.
కాఠ్మాండూ నగరపాలక సంస్థ నగరంలోని మిగతా పాఠశాలలకు తమ పేర్లు మార్చుకోడానికి 35 రోజుల సమయం ఇచ్చింది. ఆ గడువులోగా పేర్లు మార్చుకోకపోతే ఆ పాఠశాలలకు ఇచ్చిన అనుమతులను వచ్చే విద్యాసంవత్సరం నుంచీ రద్దు చేసేస్తామని నగర మేయర్ బాలెన్ షా స్పష్టం చేసారు.
నేపాల్‌లోని విద్యాసంస్థల పేర్లలో స్వదేశీ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడుకునే లక్ష్యంతోనే విద్యాసంస్థలకు విదేశీ పేర్లను తొలగించి నేపాలీ పేర్లు పెట్టిస్తున్నామని మేయర్ బాలెన్ షా వివరించారు.