ప్రముఖుల చిత్రాలు-చరిత్రతో వినూత్నంగా అసెంబ్లీ కేలండర్
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025 కేలండర్ను రూపొందించింది. దీనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి శనివారం ఆవిష్కరించారు.
కేలండర్లో ముద్రించిన తెలుగు ప్రముఖుల సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ‘గో బ్యాక్ సైమన్’ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాంతంత్ర్య ఉద్యమంలో తెగువ చూపిన టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ప్రశంసించారు. అలాగే భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, దిల్లీలో పరిపాలన – శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని గుర్తు చేశారు.
శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ జాతీయ భాష, న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం, మానవ అక్రమ రవాణాపై చేసిన కీలక సూచనలను రాజ్యాంగ సభ ఆమోదించిందన్నారు. మోటూరి సత్యనారాయణ జాతీయ భాష గురించి విలువైన సలహాలిచ్చారని, మరో ప్రముఖుడు గోగినేని రంగనాయకులు(ఎన్జీ రంగా) రాజ్యాంగంలో అధికార వికేంద్రీకరణ, అత్యవసర అధికారాలు, రెండు సభలు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై పలు సూచనలు చేశారని ముఖ్యమంత్రి వివరించారు.
భూ సేకరణకు నష్ట పరిహారం చెల్లించేలా నిబంధన తీసుకురావడంతో పాటు పాఠశాలలు, దేవాలయాల్లో ఎక్కడా వివక్ష ఉండకూడదని మతం, జాతి, కులం, లింగం ఆధారంగా నిరాదరణ చూపించకుండా నిబంధన రూపొందించాలని వీసీ కేసవరావు రాజ్యాంగసభలో ప్రతిపాదించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
డ్రాఫ్టింగ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, ప్రాథమిక హక్కులపై సబ్-కమిటీతో సహా తొమ్మిది కమిటీలలో అల్లాడి కృష్ణస్వామి భాగస్వామిగా ఉన్నారని, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఎమర్జెన్సీ నిబంధనలపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
రాజ్యాంగంలో మహాత్మా గాంధీ ఆలోచనలు ప్రతిబింబించేలా మొసలికంటి తిరుమలరావు కృషి చేస్తే.. ఆస్తి హక్కు, జమీందారీ వ్యవస్థ రద్దు గురించిన చర్చలో కళా వెంకటరావు ప్రముఖంగా పాల్గొన్నారని ముఖ్యమంత్రి తెలిపారు.
నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బారావు, రాజా శ్వేతా చలపతి రామకృష్ణరంగారావు రాజ్యాంగ రూపకల్పనలో అందించిన సహకారాన్ని మరువలేనిదన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ కోసం తొలిసారి వాడుకలోకి తెచ్చిన సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ‘ఎక్స్’, యూట్యూబ్లో @LegisAndhra ద్వారానూ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో @legisandhra ద్వారా ఇకపై ఎప్పటికప్పుడు శాసన వ్యవస్థకు సంబంధించిన సమాచారం తక్షణం తెలుసుకోవచ్చు.
శాసనవ్యవస్థ చేపట్టిన వినూత్న ప్రయత్నాలకు మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె రఘు రామకృష్ణ రాజులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘు రామకృష్ణ రాజు, రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర పాల్గొన్నారు.