భారత్ 358/9… ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 474
బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో 8వ స్థానంలో క్రీజులోకి వచ్చి 171 బంతుల్లో 103 పరుగులు చేసి సెంచరీ ఘనత అందుకున్నాడు.
విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ళ నితీశ్ కుమార్ రెడ్డి, విదేశీగడ్డపై మొదటి సారి టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. నేడు మెల్ బోర్న్ స్టేడియంలో మొదట సెంచరీ సాధించాడు. వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురికాకుండా ఆడటం నితీశ్ కే సాధ్యం అన్నట్లు షాట్లు కొట్టాడు. 10 ఫోర్లు , ఓ సిక్స్ కొట్టాడు. వెలుతురు లేమి కారణంగా ఆట ముగిసే సమయానికి 105 పరుగులతో అజేయంగా క్రీజులో నిలిచాడు.
హాఫ్ సెంచరీ తర్వాత పుష్ప మూవీలో హీరో గెశ్చర్ ను అనుకరించిన నితీశ్ , సెంచరీ పూర్తి చేసిన తర్వాత గ్రౌండ్ లో మోకరిల్లి బ్యాట్‌కి హెల్మెట్ తొడిగి అభివాదం చేశాడు. ఈ సందర్భంగా అభిమానుల కేరింతలతో స్టేడియం మార్మోగింది.
వాషింగ్టన్ సుందర్ అర్థ శతకం కూడా చాలా ప్రత్యేకం. సుందర్, 162 బంతులు ఎదుర్కొని
50 పరుగులు సాధించాడు. ఇందులో కేవలం ఒకటే ఫోర్ ఉంది. కెరీయర్ లో సుందర్ నాలుగో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో నితీశ్ తో కలిసి స్కోర్ బోర్డుకు 127 పరుగులు జోడించాడు. నాథన్ లైయన్ బౌలింగ్ లో జట్టు స్కోర్ 348కి చేరుకున్నప్పుడు ఎనిమిదో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బూమ్రా డకౌట్ గా వెనుదిరిగాడు.
సిరాజ్ తో కలిసి నితీశ్ ఆడుతుండగా ప్రతికూల వాతావరణంతో మ్యాచ్ నిలిపివేశారు. వర్షం కారణంగా గ్రౌండ్ ను కప్పివేశారు. అనంతరం మూడో రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.
ఆసీస్ బౌలర్లలో బోలాండ్ మూడు, కమిన్స్ మూడు, నాథన్ లైయన్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేయగా, భారత్ 9 వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. ఆసీస్ కంటే 116 పరుగులు వెనకబడి ఉంది.