బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామంటూ గుజరాత్‌లో రూ.6 వేల కోట్లు వసూలు చేసి పరారైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనాన్సియల్ సర్వీసెస్, బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్రసింగ్ ఝులాను పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. మోహసానా ఫాం హౌసులో దాగి ఉన్నాడనే సమాచారంతో పోలీసులు చుట్టుముట్టి భూపేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్‌లోని పలు జిల్లాల్లో 20కు పైగా కార్యాలయాలు ప్రారంభించి, ఏజంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించడం ప్రారంభించిన భూపేంద్రసింగ్ వ్యవహార శైలిపై నిఘా వర్గాలకు అనుమానం వచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్లు…అతనిపై పోలీసులు నిఘా పెట్టారు. విలాస జీవితం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేయడం, ఆర్బీఐ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు.
అప్పటికే 6 వేల కోట్లు వసూలు చేసి చెయిన్ లింకు పద్దతిలో డిపాజిట్లు స్వీకరించాడు. ఈ విధానాన్ని కేంద్రం నిషేధించింది. దీంతో భూపేంద్ర సింగ్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులు రంగంలోకి దిగారు.విషయం ముందే గ్రహించిన భూపేంద్ర సింగ్ పరారయ్యాడు. విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో భూపేంద్ర సింగ్ గత కొంత కాలంగా కనిపించకుండా పోయాడు. పోలీసులు నిఘా ఉంచి గుజరాత్‌లోని ఓ ఫాం హౌసులో అరెస్ట్ చేశారు.