జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్, ఆ దేశ పార్లమెంటు(బుండెస్టాగ్)ను శుక్రవారం రద్దు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌కు అప్పగించారు.
చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ నేత నేతృత్వంలోని మూడు పార్టీల సంకీర్ణ కూటమిలో విభేదాలు తలెత్తాయి. ఓ కీలక పార్టీ కూటమి నుంచి వైదొలగడంతో నవంబర్ 6న ప్రభుత్వం కూలింది. దీంతో నిబంధనలను అనుసరించి ఈ నెల 16న పార్లమెంట్‌లో బల పరీక్ష చేపట్టగా షోల్జ్ ఓటమి పాలయ్యారు.
జర్మనీ పార్లమెంటులో 733 మంది సభ్యులుండగా షోల్జ్‌కు అనుకూలంగా కేవలం 207 మంది , వ్యతిరేకంగా 394 మంది సభ్యులు ఓటేశారు. మిగతా 116 మంది ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. మెజారిటీకి 367 ఓట్లు అవసరం.
పార్లమెంటు రద్దు కావడంతో నిర్దేశించిన సమయానికి ఏడు నెలలు ముందుగానే ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించే విషయంలో ప్రధాన పార్టీలు అంగీకరించాయి. రాజ్యాంగ ప్రకారం పార్లమెంట్ రద్దయిన 60 రోజుల్లోగా ఎన్నికలు జరగాలి.