దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్మారకం విషయంలో కాంగ్రెస్ చేసిన రాజకీయ రచ్చ అందరికీ చిరాకు కలిగించింది. ఆ పార్టీ దివంగత నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని తూర్పారబట్టారు.
మన్మోహన్ సింగ్‌కు ఢిల్లీలో స్మారకం నిర్మించాలనీ, ఆ ప్రదేశంలోనే అంత్యక్రియలు జరిపించాలనీ కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసారు. ప్రధానమంత్రులు, ఇతర ప్రముఖ నాయకులకు అలా దేశరాజధానిలో స్మారకాలు నిర్మించడం సంప్రదాయంగా వస్తోందని గుర్తుచేసారు.
అయితే, అలాంటి సంప్రదాయాల విషయంలో ఎదుటివారికి సుద్దులు చెప్పడం తప్ప తాము ఆచరించరన్న సంగతిని శర్మిష్ఠ కాంగ్రెస్ నేతలకు గుర్తు చేసారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె తన తండ్రి విషయంలో పార్టీ అనుసరించిన తీరును దుయ్యబట్టారు. సంప్రదాయాల గురించి పెద్దకబుర్లు చెబుతున్న కాంగ్రెస్, పీవీ నరసింహారావును ఉద్దేశపూర్వకంగా అవమానించిన తీరు గురించి ప్రస్తావించడమూ విశేషం.
శర్మిష్ఠ తన ఎక్స్ పోస్ట్‌లో… తన తండ్రి, మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత అయిన ప్రణబ్ ముఖర్జీ 2020 ఆగస్టులో చనిపోయిన నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పటికి యూపీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రణబ్ ముఖర్జీ కోసం సంతాప సమావేశం ఏర్పాటు చేయలేదు. సీడబ్ల్యూసీ ఆ విషయంలో కనీసం ఆలోచన అయినా చేయలేదు. పైగా ఆ విషయం మీద ఆమెను తప్పుదోవ పట్టించారు కూడా. రాష్ట్రపతుల కోసం సీడబ్ల్యూసీ సంతాప సభ నిర్వహించే సంప్రదాయం లేదని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తనకు చెప్పాడని శర్మిష్ఠ రాసారు. అదంతా ఉత్త అబద్ధమని తనకు తర్వాత తెలిసింది. తన తండ్రి డైరీల్లో ఉన్న విషయాన్ని శర్మిష్ఠ వివరించారు. గతంలో రాష్ట్రపతిగా పనిచేసిన కెఆర్ నారాయణన్ మరణించినప్పుడు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసారనీ, ఆ సంతాప సందేశాన్ని తనే స్వయంగా తయారుచేసాననీ ప్రణబ్ ముఖర్జీ రాసుకున్నారట.
బీజేపీ నాయకుడు సీఆర్ కేశవన్ ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్ట్‌ను శర్మిష్ఠ షేర్ చేసారు. అందులో కాంగ్రెస్, తమ పార్టీకే చెందిన మరియు గాంధీ కుటుంబానికి చెందని ఇతర రాజనీతిజ్ఞులను ఎలా విస్మరిస్తుందో వివరించారు.
ఈ సందర్భంలో మన్మోహన్ సింగ్‌కు 2004 నుంచి 2009 వరకూ మీడియా సలహాదారుగా పనిచేసిన డాక్టర్ సంజయ్ బారు రాసిన పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ప్రస్తావన కూడా వచ్చింది. సంజయ్ బారు తన రచనలో 2004లో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం ఢిల్లీలో స్మారకం నిర్మించలేదని వివరించారు. 2004 నుంచీ 2014 వరకూ యూపీయే కూటమే అధికారంలో ఉన్నప్పటికీ పీవీకి గౌరవం దక్కలేదని గుర్తుచేసారు. అసలు పీవీ అంత్యక్రియలే ఢిల్లీలో జరగనీయలేదనీ, ఆయన శవాన్ని హైదరాబాద్‌కు తరలించారనీ వివరించారు.