అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి కేసులో పోలీసులు వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దాడికి దిగిన మరో 20 మంది కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఎంపీపీ గది తాళం ఇవ్వాలంటూ సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేయగా, ఎంపీపీ వస్తేనే ఇస్తామంటూ ఎంపీడీవో జవహర్‌బాబు చెప్పారు. దీంతో వైసీపీ నేత సుదర్శన్‌రెడ్డి, మరో 20 మంది వైసీపీ నాయకులు దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టారు. కాళ్ళతో తన్నారని ఎంపీడీవో మీడియాకు వెల్లడించారు. దాడిని అడ్డుకోవడానికి వచ్చిన డ్రైవర్, అటెండరుపై కూడా దాడికి దిగినట్లు ఎంపీడీవో తెలిపారు.
దాడి సమయంలో ఎంపీడీవో కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సై వచ్చి సుదర్శన్‌రెడ్డిని అరెస్ట్ చేసి, ఎస్పీ కార్యాలయానికి తరలించారు. మరో20 మంది వైసీపీ నేతలు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్యూటీలో ఉన్న రెవెన్యూ అధికారిపై దాడిని సంఘాల నాయకులు ఖండించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తనకు ప్రాణహాని ఉందని ఎంపీడీవో జవహర్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలని కోరారు. బాధితుడిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు.దాడి చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. దాడికి దిగిన వారిపై రౌడీ షీట్ తెరవాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.