మధ్యప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్, తమ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సురేష్ కుమార్ కెయిట్ మీద సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. కారణం, జబల్పూర్ పఛ్‌పేడీలో ఉండే చీఫ్ జస్టిస్ అధికార నివాసం ఆవరణలో ఉన్న ప్రాచీన హనుమాన్ దేవాలయాన్ని పడగొట్టేయాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేయడమే. ఆ సంఘటనపై దర్యాప్తు చేయించి తగిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మతపరమైన భావోద్వేగాలను, ప్రభుత్వ ఆస్తులకు చెందిన నియమ నిబంధనలనూ ఉల్లంఘించారంటూ సీజే గురించి ఫిర్యాదు చేసారు.
ఆ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకులేఖ రాసారు. ఆ లేఖలో వారు ఆ హనుమాన్ మందిరం గురించి చెప్పారు. అక్కడ గుడి ఎప్పటినుంచో ఉందని, తర్వాతే అక్కడ ప్రధాన న్యాయమూర్తి బంగ్లా నిర్మించారనీ చెప్పారు. కాలక్రమంలో గుడిని సీజే ఆవరణలోనే ఉండనీయాలని కోరారు.
ఆ బంగ్లాలో గతంలో నివసించిన జస్టిస్ ఎస్ఎ బోబ్డే, ఎఎం ఖాన్విల్కర్ ఇద్దరూ ఆ హనుమంతుడి గుడిలో పూజాదికాలు చేసేవారు. జస్టిస్ రాఫత్ ఆలం, జస్టిస్ రఫీక్ అహ్మద్ వంటి ముస్లిం ప్రధాన న్యాయమూర్తులు కూడా ఆలయం ఉనికిని గౌరవించారు, అక్కడి పద్ధతులను యథాతథంగా కొనసాగనిచ్చారు.
మధ్యప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, స్థానిక న్యాయవాది అయిన ధనంజయ్ కుమార్ జైన్, 5X6 అడుగులు మాత్రమే ఉండే ఆ గుడి విస్తీర్ణం చిన్నదని వెల్లడించారు. ‘‘ఈ ఆలయం చాలా పాతది, ఇక్కడ బంగ్లా నిర్మించడం కంటె చాలా ముందునుంచీ ఉంది. గతంలో ఉన్న సీజేలు, వారి సిబ్బంది ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా అక్కడ రోజూ పూజలు చేసేవారు’’ అని ధనంజయ్ కుమార్ చెప్పారు.
బార్ అసోసియేషన్ ఆరోపణ ప్రకారం ‘‘సీజే కెయిట్ బౌద్ధ ధర్మ అనుయాయి. 2024 సెప్టెంబర్‌లో జబల్పూర్లో ప్రధాన న్యాయమూర్తి అయిన కొత్తలోనే తన అధికార నివాసంలో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేయాలని ఆదేశాలు జారీ చేసాడు. అక్కడ దేవతా విగ్రహాలను తొలగించినట్లు సమాచారం. అయితే ఆ చర్యను సమర్ధించేందుకు ఏ ప్రభుత్వ లేక న్యాయపరమైన ఉత్తర్వూ లేదు. ఆ చర్య హిందువుల మనోభావాలను అగౌరవపరిచింది, మత స్వాతంత్ర్యానికి రాజ్యాంగం ప్రసాదించిన రక్షణలను ఉల్లంఘించింది అని బార్ అసోసియేషన్ వాదన.
సీనియర్ న్యాయవాది జైన్ ఇలా చెప్పారు. ‘‘రాజ్యాంగం భారత పౌరులకు మతస్వేచ్ఛను ఇచ్చింది. కానీ జ్యుడీషియరీకి చెందిన సభ్యులే ఆలయాలను ధ్వంసం చేయిస్తుంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల రక్షణ గురించి ఆందోళన కలుగుతోంది.’’
మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసేటప్పుడు జస్టిస్ రాఫత్ ఆలమ్ ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయించారని జైన్ వెల్లడించారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా వదిలేసేవారని గుర్తు చేసుకున్నారు. దానికి విరుద్ధంగా జస్టిస్ కెయిట్ ఆ గుడిని పడగొట్టించేయడంపై జైన్ ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే బార్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి జైన్‌ను వేరొక హైకోర్టుకు బదిలీ చేయాలని, గుడిని మళ్ళీ నిర్మింపజేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఫిర్యాదును మొట్టమొదటగా రవీంద్రనాథ్ త్రిపాఠీ అనే లాయర్ బార్ అసోసియేషన్‌కు పంపించారు. పైగా ఆయన ఇంకో కోరిక కూడా కోరారు. మధ్యప్రదేశ్ పోలీస్ స్టేషన్ల ఆవరణలో గుడుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆ కేసు విచారణ నుంచి జస్టిస్ కెయిట్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని విజ్ఞప్తి చేసారు. అలాంటి గుడులు రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తాయని వాదిస్తూ, ఆ ఆరోపణలు నిరూపించబడితే జస్టిస్ కెయిట్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘అదే నిజమైతే, ఆ చర్యలు కేవలం ఒక ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం మాత్రమే కాదు, హక్కుల పరిరక్షణలో జ్యుడీషియరీ పాత్ర గురించి ప్రజలకుండే విశ్వాసాన్ని తక్కువ చేసినట్లే’’ అన్నారు త్రిపాఠీ.
మధ్యప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించి, బాధ్యులపై తగుచర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంది. ఆలయాన్ని దాని యథాతథ స్థితిలో పునరుద్ధరించాలి అని కూడా సుప్రీంను కోరారు.
జస్టిస్ సురేష్ కుమార్ కెయిట్ హర్యానాకు చెందిన వారు. ఢిల్లీ హైకోర్టు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో జడ్జిగా పనిచేసారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సెప్టెంబర్ 2024లో నియమించింది. ఆయన ఇంకా తన ఆరోపణలపై ప్రకటన జారీ చేయలేదు.